సీసీఐ షట్‌డౌన్‌ ! | - | Sakshi
Sakshi News home page

సీసీఐ షట్‌డౌన్‌ !

Nov 17 2026 8:11 AM | Updated on Nov 17 2026 8:11 AM

సీసీఐ షట్‌డౌన్‌ !

బొగ్గు కొరతతో నిలిచిపోయిన సిమెంట్‌ ఉత్పత్తి సింగరేణి నుంచి సరఫరాలో ఆటంకాలు రైల్వే వ్యాగన్లు లేక తిప్పలు ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఉద్యోగులు, కార్మికుల విన్నపం

తాండూరు రూరల్‌: మండలంలోని కరన్‌కోట్‌ గ్రామ శివారులో గల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ(సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పరిశ్రమను కష్టాలు చుట్టుముట్టాయి. ఓ వైపు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా నిలిచిపోవడం.. మరో వైపు వ్యాగన్ల కొరత కారణంగా సిమెంట్‌ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. వారం రోజులుగా ప్లాంట్‌ షట్‌ డౌన్‌లోనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

16వేల మెట్రిక్‌ టన్నులు అవసరం

సీసీఐ పరిశ్రమకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 16వేల మెట్రిక్‌ టన్నులు అవసరమని కార్మిక సంఘం నేతలు తెలిపారు. ఒక్కో వ్యాగన్‌లో నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు వస్తుందని, నెలకు నాలుగు వ్యాగన్లు రావాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ నెలలో ఒక్క వ్యాగన్‌ కూడా రాలేదన్నారు. ఈ కారణంగానే ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలిపారు. సింగరేణి నుంచి జీ –8 గ్రేడ్‌ బొగ్గు సరఫరా చేయాల్సి ఉన్నా తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును సరఫరా చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు.

అడ్వాన్సు చెల్లించినా..

బొగ్గు సరఫరాలో రైల్వే వ్యాగన్లు కీలకం. 15 రోజుల క్రితమే కంపెనీ యాజమాన్యం రైల్వే శాఖకు అడ్వాన్సు చెల్లించినట్లు తెలిసింది. వ్యాగన్లు పంపాలని ఉన్నతాధికారులను కోరినా వారు పట్టించుకోవడం లేదని యాజమాన్యం తెలిపింది. వ్యాగన్లు అందుబాటులో లేవని సమాధానం చెబుతున్నట్లు తెలిసింది.

ప్రైవేట్‌కు ధారాదత్తం చేసే కుట్ర!

సీసీఐ సిమెంట్‌కు నాణ్యతాపరంగా మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఉత్పత్తి, సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇతర బ్రాండ్ల వైపు మళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా నష్టాల పేరుతో కంపెనీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.

కార్మికుల ఉపాధిపై..

పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30వేల మంది జీవిస్తున్నట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, రవాణ, సరఫరా, డీలర్లు, అనుబంధ వ్యాపారుల జీవనోపాధి ఈ పరిశ్రమతో ముడిపడి ఉంది. ఉత్పత్తి ఆగిపోతే వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

సిమెంట్‌ పరిశ్రమలో పని చేస్తున్న వేలాది కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. నెల కు 16వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

– వంశీకృష్ణ, ఉద్యోగి, సీసీఐ పరిశ్రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement