అల్వాల్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఐదుగురు యువకులు వినూత్న మోసానికి తెరలేపారు. గే వ్యక్తులుగా నటిస్తూ యాప్ ద్వారా వల వేసి, వారి ఇళ్లకు వెళ్లి మత్తు మందు కలిపిన బీర్లు తాగించి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లేవారు. ముఠాలో ఓ వైద్యుడు, ఇద్దరు విద్యార్థులు ఉండటం గమనార్హం. 20 మంది నుంచి 36 తులాల బంగారాన్ని అపహరించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం సీపీ సుమతి వెల్లడించిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్(24) ప్రైవేట్ ఉద్యోగి. ఆదాయం సరిపోకపోవడంతో డేటింగ్ యాప్ ఉపయోగించి బాధితులను లక్ష్యంగా చేసుకున్నాడు.
గే వ్యక్తిగా నటిస్తూ పరిచయాలు
యాప్‌లో ఆరిఫ్ గే వ్యక్తిగా పరిచయం చేసుకొని ఇతరులతో చాటింగ్, వీడియో కాల్స్ చేసేవాడు. వారి వివరాలతో పాటు ఆర్థిక స్థితిగతులు, బంగారు ఆభరణాల గురించి ఆరా తీసేవాడు. తేజావత్ సంతోష్(25), బానోతు విద్యాసాగర్(21), కార్తీక్(18), రెడ్డిగారి దినేష్‌కుమార్‌రెడ్డి(32)లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వైద్యుడైన దినేష్‌కుమార్‌రెడ్డి ఒక కిడ్నీ దెబ్బతింది. అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ముఠాలో చేరాడు. బాధితులకు ఇచ్చే బీర్లలో కలిపేందుకు మత్తు మాత్రలను సమకూర్చడంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు.
బీర్లలో మత్తు పదార్థాలు కలిపి..
యాప్ ద్వారా ఆరీఫ్ గుర్తించిన బాధితుల ఇళ్లకు ముఠాలోని ఇద్దరు సభ్యులను పంపించేవాడు. మత్తు టాబ్లెట్లు కలిపిన బీరును బాధితులకు ఇచ్చేవారు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత బంగారు ఆభరణాలను, విలువైన వస్తువులను అపహరించి పరారయ్యేవారు. ఇలా గత ఏడాది నుంచి సుమారు 20 మంది బాధితులను మోసం చేసి, రూ.50 లక్షల విలువైన 36 తులాల బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాపై ఉప్పల్, కుషాయిగూడ, హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్ పాటు విశాఖపట్నం పరిధిలో మరో 11 కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో ముఠా సభ్యులు వాంటెడ్‌గా ఉన్నారన్నారు. ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
● డేటింగ్ యాప్‌తో బాధితుల వివరాల సేకరణ
● మత్తు మందు కలిపిన మద్యం తాగించి..
● 20 మంది నుంచి 36 తులాల బంగారం చోరీ
● ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
● నిందితుల్లో డాక్టర్, ఇద్దరు విద్యార్థులు


