మొయినాబాద్: మున్సిపాలిటీలో డంపు కంపు కొడుతోంది. ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన చెత్తను హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే వేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్ల పక్కనే వేస్తుండడంతో దుర్వాసన, ఈగలు, దోమలతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. ఇందులో మున్సిపల్ కేంద్రంతోపాటు చిలుకూరు, పెద్దమంగళారం, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్, ఎనికేపల్లి గ్రామాల్లోని వార్డుల్లో అధిక మొత్తంలో చెత్త విడుదల అవుతోంది. ఇళ్లలో తడి, పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరణకు వచ్చే ఆటోలు, ట్రాక్టర్లలో వేయాలని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా అమలు కావడంలేదు. ఇళ్లలోని చెత్తను ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా సేకరించి హిమాయత్‌నగర్ రెవెన్యూలో అనధికారిక డంపింగ్ యార్డులో వేస్తున్నారు. కొంత మంది చెత్త సేకరణకు వచ్చిన వాహనాల్లో చెత్త వేయకుండా ప్లాస్టిక్ కవర్లలో కట్టి రోడ్ల పక్కన పడేస్తున్నారు.
రోడ్ల పక్కన పారబోత
మున్సిపల్ కేంద్రంలోని సురంగల్ రోడ్డులో, ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట, ఎస్సీ కాలనీ రోడ్డు, ఖాళీ స్థలాల్లో చాలామంది చెత్త పారబోస్తున్నారు. పెద్దమంగళారం రోడ్డు, చిలుకూరు పెద్ద చెరువు, మహిళా ప్రాంగణం ఎదుట, చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద ఉన్న హరిత హోటల్ పక్కన, అజీజ్‌నగర్, ఎనికేపల్లి రోడ్ల పక్కన చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. చాలా మంది చెత్తను ప్లాస్టిక్ కవర్లలో కట్టి రాత్రి సమయాల్లో రోడ్ల పక్కన పడేస్తున్నారు. ఇలా వేసిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నా తెల్లారే సరికి మళ్లీ వేస్తుండటం గమనార్హం.
రోజుకు 14 మెట్రిక్ టన్నుల చెత్త
మున్సిపాలిటీలో ప్రతి రోజు 14 మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతోంది. ఇళ్లలోని చెత్త సేకరణకు 8 ట్రాక్టర్లు, 23 ఆటోలను వినియోగిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ చేసి హిమాయత్‌నగర్‌లోని అనధికార డంపింగ్ యార్డులో డంప్ చేస్తున్నారు. 23 ఆటోల ద్వారా ప్రైవేటు వ్యక్తులు సెత్త చేకరణ చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
గుట్టలుగా పెరిగిన డంపింగ్
హిమాయత్‌నగర్‌లోని సర్వే నంబర్ 151 ప్రభుత్వ భూమిలో మున్సిపాలిటీలోని చెత్తనంతా అనధికాారికంగా డంప్ చేస్తున్నారు. సుమారు రెండేళ్లుగా మున్సిపాలిటీలోని చెత్తనంతా డంప్ చేయడంతో గుట్టలుగా పేరుకుపోయింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే డంప్ ఉండటంతో తీవ్రమైన దుర్వాసనతో వాహనదారులు ముక్కలు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. చెత్త డంపింగ్ ప్రభావంతో ఆ ప్రాంతంలోని చెట్లు సైతం ఎండిపోయాయి.
రోడ్ల పక్కనే చెత్తా చెదారం
ఇష్టారీతిన పారబోత
మొక్కుబడిగా తడి, పొడి చెత్త సేకరణ
దుర్వాసనతో స్థానికుల ఇబ్బంది


