పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ఉషు పోటీల్లో బంగారు పతకం గ్రామాభివృద్ధికి నిధులివ్వండి అదనపు కోర్టులతో సత్వర న్యాయసేవలు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ఇబ్రహీంపట్నం రూరల్‌: జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల నియామకాల ప్రక్రియ పూర్తిగా పారదర్శంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ శనివారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుందని తెలిపారు. అర్హుల ఎంపిక ఇంటర్మీడియెట్‌ మార్కులు, స్థానికత ఆధారంగా రూపొందించిన మెరిట్‌ ప్రకారం మాత్రమే జరుగుతుందన్నారు. అర్హతలు కలిగి, స్థానికత ఉన్న అభ్యర్థుల్లో అధిక మార్కులు సాధించిన వారికి మెరిట్‌ ఆధారంగా జిల్లా సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారని చెప్పారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.

కందుకూరు: ఉషు ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి పోటీల్లో మండల కేంద్రంలోని నోబుల్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న కొప్పుల శృతి బంగారు పతకం సాధించింది. మారేడిపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో అండర్‌–17 (45 కిలోలు) విభాగంలో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా శనివారం విద్యార్థినిని కరస్పాండెంట్‌ బైరు కొండల్‌రెడ్డితో పాటు ఉపాధ్యాయులు సన్మానించి అభినందించారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి ఆదుకోవాలని తులేకలాన్‌ పంచాయతీ పాలకవర్గం కలెక్టర్‌ను కోరింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఆశ్వినీ రవీందర్‌, ఉప సర్పంచ్‌ జగదీశ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, వీధి దీపాల కోసం నిధులు కేటాయించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో నిధులు ఇస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అంతకు ముందు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిశారు. కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు గజ్జల మహేశ్‌, సుర్వి జనార్దన్‌గౌడ్‌, ఆంజనేయులు, బి.యాదగిరి, స్కైలాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆమనగల్లు: రాష్ట్రంలో కొత్తగా 200 అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కం అడిషనల్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు సత్వర న్యాయసేవలు అందుతాయని రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌ కానం గణేశ్‌గౌడ్‌ అన్నారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం 33 జిల్లాల్లో అదనపు కోర్టులు మంజూరు చేసిందని తెలిపారు. కొత్త కోర్టుల ఏర్పాటుతో భూ వివాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, ఇతర సివిల్‌ కేసులతో పాటు చట్టపరమైన వివాదాల పరిష్కారం సత్వరమే అందే అవకాశం ఉంటుందన్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 30 కోర్టులు ఏర్పాటు కానున్నాయని, అందులో ఆమనగల్లు ఉండడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సమావేశంలో లీగల్‌సెల్‌ నాయకుడు ఆకుల శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

బొంరాస్‌పేట: రైతు నమోదును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి కవిత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతు నమోదు ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, రాయితీలు పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరని చెప్పారు. ఈనెల 30 వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement