● 5,118 పంచాయతీలకు సొంత బిల్డింగ్‌లు
● రూ.3,382 కోట్లతో 3,861 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
● రూ.800 కోట్లతో 8వేల మహిళా సమాఖ్య భవనాలు
● ప్రాంతీయ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సొంత భవనం లేని ప్రతీ జీపీకి పక్కా భవనం మంజూరు చేశామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. తెలంగాణలో 5,118 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని, వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. వీటిలో ఇప్పటికే 3,269 భవనాల పనులు 70శాతం పూర్తయ్యాయని, డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. 8వేల గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.800 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
హ్యామ్ విధానంలో గ్రామీణ రోడ్లు
రాష్ట్రంలోని గ్రామీణ రహదారులను దేశంలోనే తొలిసారిగా హ్యామ్ విధానంలో నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రూ.3,382 కోట్ల అంచనాతో 3,861 కిలోమీటర్ల మేర రహదారులను ఈ పద్ధతిన నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. మొదటి విడతలో చేపడుతున్న రహదారుల్లో సుమారు 50 శాతం పనులు ఈ నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయన్నారు.
మంచినీటి సరఫరాపై అప్రమత్తం
ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. పైనాలుగు జిల్లాల్లోని 19 రిజర్వాయర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని, సింగూరు మినహా మిగిలిన రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. నిజాంసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించే చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలు, చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
నిర్లక్ష్యాన్ని సహించబోం
అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉపాధి హామీ పనులు కల్పించాలని మంత్రి సీతక్క సూచించారు. ఇందుకోసం రూ.6 వేల కోట్ల బడ్జెట్ సిద్ధంగా ఉందన్నారు. జలసిరి కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని, నాణ్యతలో అధికారులు రాజీపడొద్దని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, అడిషనల్ కమిషనర్ రవీందర్, అదనపు కలెక్టర్లు, సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీఓలు, ఇంజినీరింగ్ చీఫ్‌లు, ఎస్‌ఈలు, ఈఈలు, ప్రాజెక్ట్ మానిటరింగ్ అధికారులు, జాయింట్ కమిషనర్లు, ఇతర సీ నియర్ అధికారులు, హ్యామ్ రహదారుల కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


