ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ తెగువ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ నారాయణరెడ్డి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమికోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఐలమ్మ జీవితంలో అనేక కష్టాలు, అణచివేతలను ఎదుర్కొని ప్రజల కోసం పోరాటం చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్, జిల్లా బీసీ సంక్షేమాధికారి కేశురాం, రజక సంఘం నాయకులు అజయ్, దశరథ, సుధాకర్, బండ ఆంజనేయులు, నర్సింహ, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


