యాచారం: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్నులను సర్కార్ భారీగా పెంచేసింది. పెంచిన ఇంటి పన్నులను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే చెల్లించాలని పంచాయతీల నుంచి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 65(3) ప్రకారం నోటీసు అందిన 30 రోజుల్లోపు ఇంటి పన్ను మొత్తం చెల్లించాలని, లేదా తగిన కారణం చూపాలని లేని పక్షంలో చరాస్తుల జప్తు చేయడం జరుగుతుందని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెంచిన పన్నుల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 526 పంచాయతీల్లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీల నుంచి ఇంటి యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. కొత్త ఇంటి నిర్మాణాలకు అసెస్మెంట్ చేసి పన్నులు పెంచాలని పంచాయతీ రాజ్ శాఖ నుంచి కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టారు.
గల్లా గలగల
పెంచిన ఇంటి పన్నులతో పంచాయతీ గల్లాపెట్టెలు నిండనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2024–25 ఆర్థిక సంవత్సం పన్నుల వసూళ్ల టార్గెట్ రూ.33,97,86,218 ఉండగా పెంచిన 15 శాతం అదన పన్నులతో రూ.39,97,48,491 పెరగనుంది. అంటే రూ. 5,99,62,273 వరకు ఆదాయం రానుంది. గతంలో వసూలు చేసే ఇంటి పన్నులను పంచాయతీలు ఎస్‌టీఓల్లో జమ చేసి ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే వారు. ఖాతాల ఫ్రీజ్, ఎస్‌టీఓలో నగదు నిల్వలు లేకపోయినప్పుడు పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితి వచ్చేది. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ కల్పించిన వెసులుబాటుతో పంచాయతీల్లో వసూలు చేసే ఇంటి పన్నులను స్థానికంగానే ఉన్న నేషనల్ బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలు తెరిచి జమ చేసుకోవచ్చు. తర్వాత పంచాయతీలకు అవసరం వచ్చినప్పుడు పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ, సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ చెక్‌పవర్‌తో బ్యాంకుల్లో ఉన్న నిధులను క్షణాల్లోనే విత్‌డ్రా చేసుకోవచ్చు.
ప్రజల్లో ఆందోళన
పంచాయతీల్లో పెంచే 15 శాతం అదనపు పన్నులతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొత్తగా వెలుతురు, డ్రైనేజీ, నీటి పన్నులను ఐదు శాతం చొప్పున వసూలు చేయడానికి నిర్ణయించడంపై ప్రజల్లో ఏ మేరకు అభిప్రాయం ఉంటుందోనని పంచాయతీల పాలకవర్గాలు, కార్యదర్శుల్లో భయం నెలకొంది. గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ ఉచితంగా కష్ణాజలాల సరఫరాను ప్రారంభించారు. తాజాగా సర్కార్ నిర్ణయంతో నీటి పన్నుల వసూలుకు నోటీసులు జారీ చేస్తే ప్రజలు పన్నులు చెల్లిస్తారా, డ్రైనేజీ పన్నులు వసూలు చేయడం పంచాయతీలకు కష్టమేనని సర్పంచులు పేర్కొంటున్నారు. నీటి, డ్రైనేజీ, వెలుతురు పన్నులు వసూలు చేయడంతో ఇక నుంచి వారికి సరిపడా నీళ్లు రాకున్నా, వీధి లైట్లు పాడైపోయినా, చెత్తాచెదారం పెరుకుపోయినా కష్టాలేనని కార్యదర్శులు భయాందోళన చెందుతున్నారు.
15 శాతం పెరగనున్న ఇంటి టాక్స్‌లు
ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు
యజమానులకు నోటీసుల జారీ
జిల్లా వ్యాప్తంగా పంచాయతీలకు
రూ.6 కోట్ల ఆదాయం
కొత్తగా పెంచిన పన్నులు
అభివృద్ధి కోసమే ..
పెంచిన ఇంటి పన్నులు పంచాయతీ అభివృద్ధి కోసమే. ఇళ్లకు పెంచిన ఇంటి పన్నులతో నోటీసులు జారీ చేస్తున్నాం. వెలుతురు, నీటి, డ్రైనేజీ పన్నుల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందే అవకాశం ఉంటుంది. పన్నుల వసూళ్లతో మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. నోటీసులు అందిన గడువులోగా పన్నులు చెల్లించాలి. సమస్యలుంటే పంచాయతీ దృష్టికి తేవాలి.
– శివకుమార్, పంచాయతీ కార్యదర్శి, యాచారం


