శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్‌ | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్‌

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

రోడ్డు పనులు ప్రారంభం

ఆమనగల్లు: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. మండలంలోని ఆకుతోటపల్లి గ్రామం నుంచి రోడ్డు పనులను ప్రారంభించారు. మూడు నాలుగు నెలలుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. దీంతో కాంట్రాక్ట్‌ చేజిక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో పనులు షురూ అయ్యాయి. ప్రస్తుతం వందమీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపడుతున్నారు. రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

రోడ్డు నిర్మాణానికి భూసేకరణ

ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు నిర్మాణాన్ని మొదటి ఫేస్‌లో రావిర్యాల నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు (19.20 కి.మీ), రెండో ఫేస్‌లో మీర్‌ఖాన్‌పేట నుంచి ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు (22.30 కి.మీ) రోడ్డు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు భూసేకరణ చేపట్టారు. ఇందుకోసం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలో 59 మంది రైతులకు చెందిన 83.10 ఎకరాలు, ఆమనగల్లు మున్సిపల్‌ పరిధిలోని సాకిబండతండాలో 26 మంది రైతులకు చెందిన 66.23 ఎకరాల భూమిని రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. కడ్తాల్‌లో 72.23 ఎకరాలు, ముద్విన్‌ గ్రామంలో 179.02 ఎకరాలు సేకరించడానికి ప్రతిపాదించారు. ఈ మేరకు అధికారులు రైతులతో పలు విడతలు చర్చించి నష్టపరిహారం నిర్ణయించారు. భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారికి దాదాపు 90 శాతం మందికి ప్రభు త్వం పరిహారం చెక్కులు అందించింది. నిరాకరించినవారికి జనరల్‌ అవార్డు కింద పరిహారం అందించనున్నట్లు సమాచారం. కడ్తాల్‌ మండలంలో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు.

ఆకుతోటపల్లి నుంచి రోడ్డు ప్రారంభం

వందమీటర్ల వెడల్పుతో నిర్మాణం

వడివడిగా సాగుతున్న పనులు

నిర్మాణం పూర్తయితే తగ్గనున్న ట్రా‘ఫికర్‌’

భూముల ధరలు పెరిగే అవకాశం

ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టీ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు. మూడునాలుగు నెలల క్రితమే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. మీర్‌ఖాన్‌పేట నుంచి కడ్తాల్‌, ఆకుతోటపల్లి మీదుగా ట్రిపుల్‌ ఆర్‌ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆకుతోటపల్లి సమీపంలో క్రషర్‌ ఏర్పాటు చేశారు. వందమీటర్ల వెడల్పుతో నిర్మాణ పనులు చేస్తున్నారు. రేడియల్‌ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్‌ రోడ్డు, సైకిల్‌ట్రాక్‌, ఫుట్‌పాత్‌తో పాటు మెట్రో రైలు నిర్మాణానికి డిజైన్‌ చేయడంతో ఆ మేరకు పనులు చేపడుతున్నారు. నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ గణనీయంగా తగ్గనుంది. కొన్నేళ్లుగా రియల్‌ఎస్టేట్‌ రంగం ఈ ప్రాంతంలో పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో రియల్టర్ల సందడి ప్రారంభమైంది. రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement