ఇబ్రహీంపట్నం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కామ్రేడ్ తోడే అడివయ్య పోరాట జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ ఆదివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. అడివయ్య మనుమరాలు, బాలచందర్ కుమార్తె తోడే మానస అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలన్నారు. నాటి ప్రజల హక్కుల కోసం కామ్రేడ్స్ తోడే అడివయ్య, కృష్ణమూర్తి, కె.కోటప్ప, పి.జంగయ్య, కె. జంగారెడ్డిలాంటి యోధులు పోరాడి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు. చరిత్రను పుస్తకాల్లో చదవడంతో సరిపెట్టకుండా, నాటి యోధుల త్యాగాల స్ఫూర్తిని నేటి సామాజిక పోరాటాల్లో కొనసాగించాలన్నారు.
తండ్రి చివరి కోరిక నేరవేర్చిన పిల్లలు
కామ్రేడ్ తోడే అడివయ్య జీవిత చరిత్రను పుస్తకరూపంలో ప్రజలకందించాలని తపన పడి రచించిన అతని కుమారుడు తోడే బాలచందర్ అకస్మాత్తుగా మృతిచెందారు. తండ్రి బాలచందర్ చివరి కోరికను కుమార్తె తోడే మానసకుమారి, కుమారుడు డా.తోడే మదన్ పుస్తకావిష్కరణ వేడుకలను ప్రముఖుల మధ్య నిర్వహించి నెరవేర్చారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు ఝాన్సీ, సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు ప్రేమలత, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు జంగారెడ్డి, ఎ.మల్లేష్, హైకోర్టు న్యాయవాది భగవంత్‌రెడ్డి, రిటైర్డ్ డీసీపీ జాన్‌వెస్లీ, హుణనాయక్, కె.రాంరెడ్డి, టి.సత్యనారాయణ, మధుసూధన్‌రెడ్డి, చందునాయక్, బి.సత్తన్న, కుటుంబసభ్యులు తోడే మానస, మదన్, సీపీఐ మండల కార్యదర్శి సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి బోడ సామేల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


