షాద్‌నగర్: గ్రీన్ ఫీల్డ్ డీమ్డ్ యూనివర్సిటీ హార్ట్‌ఫుల్‌నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్‌వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్‌కు శిక్షారత్న అవార్డు అందజేశారు. ఆదివారం నందిగామ మండలం కన్హాశాంతి వనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ స్థాపించి ఓటర్లను చైతన్య పరుస్తూ కార్యక్రమాలు నిర్వహించినందుకు అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు, చైతన్య సదస్సులు నిర్వహిస్తానని డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు.
బడంగ్‌పేట్: తెలంగాణ విమోచన జైత్రయాత్రలో భాగంగా ‘చలో చార్మినార్’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌ను ఆదివారం ఉదయాన్నే పోలీసులు నాదర్‌గుల్‌లోని ఆయన ఇంటికి చేరుకుని ముందస్తు అరెస్ట్ చేశారు. అడ్డుకోబోయిన కార్యకర్తలు, నాయకులను సైతం అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. తెలంగాణ రజాకార్ల పాలన నుంచి ఇంకా విముక్తి కాలేదని అన్నారు. రాష్ట్రంలో రజాకార్ల పాలనను తలపించే పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో చలో చార్మినార్ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి తోకల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శ్రీరాములును కలిసి మాట్లాడారు.
కడ్తాల్: బంజారా సేవాదళ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా మండల పరిధిలోని గుర్లకుంటతండాకు చెందిన వాక్డోవత్ హన్మానాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఆదివారం నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశంలో బంజారా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాంరాథోడ్ నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హన్మానాయక్ మాట్లాడుతూ.. బంజారాల సమాజ ప్రగతి, సంఘం ఆశయాల సాధనకు నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. అనంతరం గిరిజన నాయకులు హన్మానాయక్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇబ్రహీంపట్నం: సీపీఎం జిల్లా నూతన కార్యదర్శిగా బోడ సామెల్‌ను జిల్లా కమిటీ నియమించింది. తులేకలాన్ గ్రామానికి చెందిన సామెల్ ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. అకస్మాత్తుగా జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్యను తొలగించి బోడ సామెల్‌ను నియమించడంతో వామపక్షాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి యాదయ్య తప్పుకున్నాడా లేక ఆ పార్టీ సెంట్రల్ కమిటీ యాదయ్యను తప్పించిందా అనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో సస్పెండైన కార్మిక సంఘం ఓ మహిళ నేత ఫిర్యాదు మేరకు సెంట్రల్ కమిటీ యాదయ్యను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.


