మీర్‌పేట: ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి ఆర్టిజన్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతిపురి తండాకు చెందిన కర్నాటి కృష్ణకాంత్ (43) మీర్‌పేట సెక్షన్ పరిధిలో ఆర్టిజన్ (జూనియర్ లైన్‌మెన్)గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నందిహిల్స్ రోడ్ నం–2లోని ఓ ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు రావడంతో కృష్ణకాంత్‌కు ఏఈ ఫోన్ చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో అతను వెంకటాద్రి హోమ్స్ అపార్ట్‌మెంటు ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలి కింద పడగా తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతదేహంతో ఆందోళన
విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యుత్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే తన భర్త మృతి చెందాడని భార్య శాంత ఆరోపించారు. న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు సముదాయించినప్పటికీ వినకపోవడంతో అంబులెన్స్‌లో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సెక్టార్ తన భర్త పరిధిలోనిది కాదని, అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా పంపించారని ఫిర్యాదులో పేర్కొంది.
ఏఈ వివరణ
మరమ్మతుల కోసం వెళ్లిన కృష్ణకాంత్ ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేయాల్సింది మరో ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేశాడని, సరైన అవగాహన లేకే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని ఏఈ బాలాగౌడ్ తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం
అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన


