బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో, లక్షల, కోట్ల నిధులతో మండలంలోని ప్రతి గ్రామానికి, గిరిజనతండాలకు సైతం బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల ఆదరబాదరాగా పనులు పూర్తి చేసి, బిల్లులు తీసుకుంటున్నారు. పలుచోట్ల ఇటీవల నిర్మించిన బీటీ రోడ్లకు ఇరువైపులా వేసిన మట్టి వర్షాలకు కొట్టుకుపోయింది. ఇలా మూడుమామిళ్లతండా, బీక్యానాయక్‌తండాల మధ్య సైడ్‌బర్మ్‌లు కోతకు గురవడంతో ప్రమాదకరంగా మారాయి. అధికారులు స్పందించి క్షేత్ర సందర్శన చేసి మట్టి పనులు చేపట్టాలని ఆయా గ్రామాల, గిరిజన తండాల ప్రజలు, వాహనాదారులు కోరుతున్నారు.
● జూబ్లీహిల్స్ సంపన్నుల పిల్లల కేసులో ఇద్దరి అరెస్టు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన ‘రిచ్ కిడ్స్’ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న కోడూరి మీనాకుమారి (41), వినీల్‌చౌదరి అలియాస్ వినీల్‌బాబు (38)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అరెస్టయిన వారిలో మీనా కుమారి సామాజిక సేవా రంగంలో ఉన్నట్లు, వినీల్‌చౌదరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసులో ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్న పోలీసులు, దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ధారూరు: ఇంటి స్థలాన్ని దాయాది ఆక్రమించడంతో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన శాంత్‌కుమార్(20) ఇంటి ముందు ఉన్న స్థలాన్ని దాయాది మల్కప్ప ఆక్రమించాడు. ఈ నెల 2న శాంత్‌కుమార్ గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. మల్కప్ప, మంగమ్మ, మల్లయ్య కలిసి ప్రశాంత్‌కుమార్, అతని తల్లి భూమని నిర్మలమ్మపై గొడవకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన శాంత్‌కుమార్ పురుగు మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని నగరంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తల్లి నిర్మలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్ల మరమ్మతు, ఫ్రీ లెఫ్ట్‌లపై దృష్టి
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వర్షాకాల సన్నద్ధత, ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండాముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఎం.రమేష్ వివిధ విభాగాల అధికారుల్ని కోరారు. సోమవారం గచ్చిబౌలిలోని కమిషన రేట్‌లో ట్రాఫిక్ నిర్వహణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లు, గుంతలకు మరమ్మతు లతోపాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవసరమైన చోట్ల కొత్తగా ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటు, ఉన్న వాటి అభివృద్ధి, కీలక కూడళ్లలో కొత్త ట్రాఫిక్ సిగ్నళ్ల అమరిక, పని చేయనివాటి పునరుద్ధరణపై చర్చించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని నిర్ణయించారు. పాదచారుల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, మరమ్మతులపై దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే, ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గితే సురక్షిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. వాటర్‌బోర్డ్ ఎండీ అశోక్‌రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి.పాటిల్, టీజీఐఐసీ వీసీ కె.శశాంక పాల్గొన్నారు.


