సద్వినియోగం చేసుకోవాలి
కేశంపేట: రాష్ట్రపతి భవన్‌లో ఆతిథ్యం.. దేశ ప్రథమ పౌరుడితో అభినందనలు.. కేంద్ర మంత్రులతో ప్రశంసలు.. దేశ దిగ్గజ శాస్త్రవేత్తలతో సమాలోచనలు.. ఇలాంటి అరుదైన అవకాశం ఎవరు కాదంటారు? ఇవి కావాలంటే తెలివికి పదును పెట్టాలి.. అలాంటి ఆలోచనలు ఉన్న విద్యార్థుల కోసమే ఈ ఇన్‌స్పైర్ మనక్.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భవిష్యత్‌లో భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్’(ఇన్‌స్పైర్) పథకంను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి ఇన్స్‌స్పైర్ మనక్ అవార్డులను అందిస్తోంది. 2026–27కు గాను 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే 10 నుంచి 17 ఏళ్ల వయస్సులో ప్రతిభ కలిగిన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మిలియన్ మంది విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలకు పదును పెట్టడమే ఇన్‌స్పైర్ మనక్ లక్ష్యం.
అర్హులు వీరే..
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్‌లైన్స్ పాటిస్తూ ప్రయోగం చేసే వివరాలను క్లుప్తంగా నమోదు చేస్తూ ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం
● ఇన్‌స్పైర్‌కు నామినేషన్‌లో పాల్గొనేందుకు పాఠశాల వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. గత విద్యా సంవత్సరంలో లాగిన్ అయిన పాఠశాలలు పాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఎంట్రీ కావొచ్చు.
● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
● www.inspireawards&dst.gov.in వెబ్‌సైట్‌లో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
● పాఠశాల వివరాలను నమోదు చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఇట్టి దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది.
● వీరు ఆమోదిస్తే విద్యార్థికి పొందుపర్చిన మొయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది.
● లింక్‌తో యూజర్ ఐడీకి పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
● విద్యార్థి తన సమాచారం, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.
● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి ఖాతాలో రూ.పది వేలు జమ చేస్తారు.
● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు.
● ఆన్‌లైన్‌లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
సెప్టెంబర్ 15 గడువు
విద్యార్థులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలి.
గత విద్యా సంవత్సరంలో...
2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా స్ధాయికి 1,889 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటి నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 108 నామినేషన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయి నుంచి కాకతీయ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రయోగం సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు, బాలాపూర్ జెడ్పీహెచ్‌ఎస్, నాగార్జున హైస్కూల్ వనస్థలిపురం, విద్యా వికాస్‌హైస్కూల్, సైబర్‌ఎడ్జ్ హైస్కూల్ విద్యార్థులు చేసిన ప్రయోగాలను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. జాతీయ స్థాయికి ఎంపికై న ఆయా పాఠశాలల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.25వేలు అందజేసి వరంగల్‌లోని ఎన్‌ఐటీలో ఓరియంటేషన్ ప్రోగాంను అందించారు. వీరు ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించే సైన్స్‌ఫెయిర్‌లో తమ ప్రయోగాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
విద్యార్థుల ఆవిష్కరణలకు ఆహ్వానం
ప్రాజెక్టు తయారీకి రూ.పది వేలు జమ
ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలు
విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇన్‌స్పైర్ ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుల సహకారంతో పోటీల్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించాలి. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రయోగాలకు తగ్గకుండా విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి.
– వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి


