ఇబ్రహీంపట్నం: డిగ్రీలో ఇప్పటి వరకు అడ్మిషన్ పొందని విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించిందని ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక తెలిపారు. ఈనెల 11వ వరకు స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌లో దోస్త్ రిజిస్ట్రేషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థులు (దోస్త్ కోడ్ 12038) వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని తెలిపారు. బీఏ, బీ.కాం(కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ, (లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, డెయిరీ, క్రాప్ ప్రొడక్షన్) కోర్సులు ఉన్నాయని చెప్పారు. ఈఏడాది కొత్తగా బీ.కాం.(ఫెనాన్స్) కోర్సును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వినోబానగర్‌లోని నూతన డిగ్రీ కళాశాల భవనంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, అసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా సంప్రదించవచ్చునని చెప్పారు.
ఇబ్రహీంపట్నం: బీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి క్యామ మల్లేశ్‌ను శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పరామర్శించారు. ఇటీవల క్యామ మల్లేశ్ స్వల్ప అస్వస్థతకు గురై వనస్థలిపురంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మీర్‌పేట: టీకేఆర్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘క్వాంటం అరీనా హ్యాకథాన్’ జాతీయ స్థాయి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ తీగల హరినాథ్‌రెడ్డి, కోశాధికారి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 విద్యార్థులు, డెవలపర్లు పాల్గొని సరికొత్త ఆలోచనలతో డిజిటల్ పరిష్కారాలైన అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, ఏఐ మోడల్స్ కనిపెట్టే కోడింగ్ పోటీలతో పాటు మెషిన్ లెర్నింగ్, వెబ్, యాప్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నూతన సాంకేతికతలపై టాస్క్‌లు ఇవ్వడం జరిగిందన్నారు. 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి తక్కువ సమయంలో ఎక్కువ బృందాలుగా ఏర్పడి కొత్త ఆవిష్కరణలను సృష్టించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామస్వామిరెడ్డి, వివిధ విభాగ అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తూరు: మేకగూడ సింగిల్‌విండో చైర్మన్‌గా ఎస్‌బీపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయనతో పాటు నూతనంగా ఎన్నికై న డైరెక్టర్లకు నియామకపు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన కార్యాలయంలో పాలకవర్గంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే ప్రతీ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో పదవిని అప్పగించడం పట్ల ఆయన ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.


