‘రేడియల్‌’ రయ్‌ రయ్‌ | - | Sakshi
Sakshi News home page

‘రేడియల్‌’ రయ్‌ రయ్‌

Aug 10 2026 7:14 AM | Updated on Aug 10 2026 7:14 AM

డిసెంబర్‌ నాటికి రావిర్యాల– ఆమన్‌గల్‌ రోడ్డు మొదటి దశ పూర్తి

భూసేకరణ, నిర్మాణ పనులపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సమీక్ష

సాక్షి, సిటీబ్యూరో: రేడియల్‌ రోడ్డు పనులపై హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సీరియస్‌గా దృష్టి సారించింది. రావిర్యాల నుంచి ఆమన్‌గల్లు వరకు చేపట్టిన మొదటి దశ పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం నానక్‌రాంగూడలోని హెచ్‌ఎండీఏ అనుబంధ హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌)లో అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు.

అక్కడక్కడా అడ్డంకులు..

ఓఆర్‌ఆర్‌ రావిర్యాల ఎగ్జిట్‌ నుంచి ఫ్యూచర్‌సిటీ మీదుగా ఆమన్‌గల్‌ వరకు రెండు దశల్లో నిర్మించనున్న 41.5 కి.మీ రేడియల్‌ రోడ్డు కోసం భూసేకరణ తుది దశకు చేరుకున్నా.. అక్కడక్కడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కొన్ని చోట్ల న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. భూసేకరణలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు రెవెన్యూ తదితర విభాగాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, సకాలంలో నిర్మాణ పనులను చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

గ్లోబల్‌ సమ్మిట్‌ నాటికి పురోగతి..

వచ్చే డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ నాటికి రేడియల్‌ రోడ్డు మొదటి దశ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ వరకు 6–లేన్లతో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే చేపట్టి 8– లేన్లకు విస్తరించనున్నారు. మొదటి దశలో రావిర్యాల్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌ వరకు 19.2 కి.మీ అంచనా వ్యయం రూ.1,282.30 కోట్లు. రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్‌ నుంచి ఆమన్‌గల్లు వరకు 22.3 కి.మీ.ఉంటుంది. దీని అంచనా వ్యయం రూ.1,538.31 కోట్లు. భూసేకరణ పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

త్వరలో బుద్వేల్‌– కొడంగల్‌కు టెండర్లు..

ఓఆర్‌ఆర్‌ బుద్వేల్‌ ఎగ్జిట్‌ నుంచి కొడంగల్‌ వరకు నిర్మించనున్న సుమారు 81 కి.మీ రేడియల్‌ రోడ్డు–2 ప్రాజెక్టు డీపీఆర్‌లను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నోటిఫికేషన్‌ను వెలువరించనున్నట్లు హెచ్‌జీసీఎల్‌ అధికారులు తెలిపారు. ఔటర్‌ నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు వివిధ ప్రాంతాల్లో 16 చోట్ల ఈ తరహా రేడియల్‌ రోడ్లను దశలవారీగా నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement