జూలై నెల సైబర్ క్రైమ్ ఠాణా గణాంకాలు విడుదల
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత నెలలో దేశంలోని 15 రాష్ట్రాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా 49 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు శుక్రవారం ప్రకటించారు. ఈ కాలంలో 70 కేసులు నమోదు చేసి రూ.98,89,202 రీఫండ్ చేసినట్లు పేర్కొన్నారు. ట్రేడింగ్ మోసాల్లో 29 మంది, సోషల్ మీడియా నేరాల్లో ఐదుగురు, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ముగ్గురు, వాట్సాప్ డీపీ ఫ్రాడ్స్‌లో ముగ్గురు, మ్యాట్రిమోనియల్ మోసాల్లో ఇద్దరు, ఏపీకే ఫ్రాడ్, క్రిప్టో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్, జాబ్, పోక్సో, పాత నాణేల కొనుగోలు మోసాల్లో ఒక్కోక్కరిని అరెస్టు చేశామని అన్నారు. గత నెలలో ట్రేడింగ్ ఫ్రాడ్‌కు సంబంధించి 25 కేసుల్లో రూ.11,75,83,416 నష్టం వాటిల్లగా రూ.58,23,217 రిఫండ్ చేయించారు. ఏపీకే ఫ్రాడ్స్‌లో రూ.13,19,218లకు రూ.8,75,386, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లో రూ.1,50,79,585కి రూ.12,78,136, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్‌లో రూ.9,36,816కి రూ.5,14,713 రిఫండ్ చేయించామని శ్రీనివాసులు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాల్లో రూ.4,27,824, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్‌లో రూ.3,60,768, జాబ్ ఫ్రాడ్స్‌లో రూ.50,000, వాట్సాప్ డీపీ మోసాల్లో రూ.5,59,158 రికవరీ చేశామని వివరించారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల్లో అశ్లీల కంటెంట్, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ వెబ్‌సైట్లను ప్రచారం చేస్తున్న 128 ప్రొఫైళ్లు, 36 పెయిడ్ యాడ్‌లను గుర్తించి బ్లాక్ చేయించామని అదనపు సీపీ చెప్పారు. ఇలా ఇప్పటివరకు మొత్తం 1,086 ప్రొఫైళ్లు, 2,553 ప్రకటనలను తొలగించి, వీటికి సంబంధించి తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు.
కొత్తూరు: మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ శివారులో ఉన్న ఇండియన్ ఆయిల్ బాట్లింగ్ ప్లాంట్‌లో శుక్రవారం ఆక్టోఫస్, ఇతర భద్రత బలగాలు మాక్‌డ్రిల్ చేపట్టారు. అనుకోని సందర్భాల్లో అనుమానితులు ప్లాంట్‌లోకి చొరబడితే, ఇతర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయా శాఖల పరస్పర సహకారంతో ఎలా స్పందించాలో కార్మికులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీర్రాజు డీఎస్‌పీ(ఎస్‌ఓసీ), చార్లీ స్వాట్ టీం, ఆక్టోఫస్, షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఫైర్, స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు దోస్తు ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు గాను ఈనెల 11వ తేదీలోపు విద్యార్థులు దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకొని కళాశాల ఆప్షన్స్ ఎంచుకోవాలని తెలిపారు. 14న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 18వ తేదీ వరకు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. బీఎస్సీ లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బీఏ తెలుగు, ఇంగ్లిష్ మీడియం, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఫార్మాస్యూటికల్ సైన్స్, బీకాం రిటైల్స్ ఆపరేషన్స్, ఏఈడీపీ కోర్సుల్లో సీట్లు మిగిలి ఉన్నట్లు తెలిపారు.
చికిత్స కోసం వచ్చి.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి
● వికారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన
అనంతగిరి: ఛాతిలో మంట రావడంతో చికిత్స కోసం వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన నరేష్(33) షాద్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన సాయంత్రం స్నేహితులతో కలిసి నవాబుపేటకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా ఛాతిలో మంట రావడంతో మధ్యాహ్నం వికారాబాద్‌లోని మేడిక్యూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం నరేష్‌ను వైద్యులు డిశ్చార్ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన వైద్యులు పీసీఆర్ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే నరేష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రఘుకుమార్, డీఎస్పీ అంజయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.


