మంచాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచాల మండలం జాపాలకు చెందిన వట్టి పాండుయాదవ్(36) వ్యవసాయ కూలీ. గురువారం సాయంత్రం బైక్‌పై ఆరుట్ల గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాండు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో జంగయ్య, సత్తమ్మ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


