కామన్‌ పాసు.. | - | Sakshi
Sakshi News home page

కామన్‌ పాసు..

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

ఆర్టీసీకి, మెట్రోకు ఇక ఒకటే పాస్‌

కమాన్‌ బాసూ!

సాక్షి, సిటీబ్యూరో: ఒకే పాస్‌పై రెండు ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఆర్టీసీ, హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కార్యాచరణ చేపట్టాయి. లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ కోసం సిటీబస్సులకు అనుబంధంగా ఆర్టీసీ ప్రవేశపెట్టనున్న ఈ– ఆటోరిక్షాల్లోనూ కామన్‌ పాస్‌లను వినియోగించుకోవచ్చు. మెట్రో రైళ్లలో వివిధ రకాల పాస్‌లను ప్రవేశపెట్టాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. చార్జీల నిర్ధారణ, పాస్‌ల రూపకల్పన తదితర అంశాలపై ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు రెండు రోజుల క్రితం బస్‌భవన్‌లో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల బస్‌పాస్‌లనే మెట్రోరైళ్లకు కూడా పొడిగించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ నుంచి మెట్రోకు, మెట్రో నుంచి ఆర్టీసీకి నిరాటంకమైన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఒకే పాస్‌ను వినియోగించడంతో చార్జీల భారమూ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. కామన్‌ పాస్‌ల చార్జీలపైనే స్పష్టత రావాల్సి ఉంది.

మూడు రకాలుగా..

ప్రస్తుతం ఆర్టీసీలో డైలీ, మంత్లీ పాస్‌లు ఉన్నాయి. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సులకు వివిధ ధరల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు వీక్లీ పాస్‌లను ప్రవేశపెట్టలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో వీక్లీ పాస్‌లను కూడా ప్రవేశపెట్టనున్నారు. మూడు రకాల పాస్‌లే మెట్రోలోనూ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో నెలవారీ పాస్‌లు రూ.1600, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో రూ.1,800, డీలక్స్‌ బస్సుల్లో రూ.2,200 చొప్పున లభిస్తున్నాయి. డైలీపాస్‌ రూ.150గా ఉన్నాయి. ఆర్టీసీ, మెట్రో కామన్‌ పాస్‌లను ప్రవేశపెడితే ఒకే పాస్‌పై మెట్రో రైళ్లతో పాటు ఈ మూడు రకాల బస్సుల్లో పయనించవచ్చు. ‘సిటీ బస్సుల్లో నిత్యం సుమారు 22 లక్షల మంది పయనిస్తున్నారు. మెట్రో రైళ్లలో 4.7 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఉమ్మడి పాస్‌లు అందుబాటులోకి వస్తే మెట్రోల్లో, సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.’ అని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ కూడా లభిస్తుందని చెప్పారు.

ఎల్‌అండ్‌టీ కసరత్తు

ఉమ్మడి పాస్‌లపై ఆర్టీసీ చార్జీల్లో స్పష్టత ఉండగా.. మెట్రో చార్జీలపైనే స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో కామన్‌ పాస్‌లతో పాటు ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్నట్లు మెట్రో రైళ్లకే పరిమితమయ్యే పాస్‌లను కూడా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ మేరకు మెట్రో రైళ్లలో డైలీ, వీక్లీ, మంత్లీ పాస్‌లను రూపొందించడంతో పాటు కామన్‌ పాస్‌లపై ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌కు బాధ్యతలను అప్పగించారు. మెట్రో, కామన్‌ పాస్‌ల చార్జీలను త్వరలో ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

త్వరలో మరో సమావేశం

కామన్‌ పాస్‌లతో పాటు హుమ్టా ప్రతిపాదించిన ఉమ్మడి మొబైల్‌యాప్‌పై ఈ వారంలో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమావేశంలో అన్ని రకాల పాస్‌ల చార్జీలపై స్పష్టమైన అవగాహన ఏర్పడనుంది.‘ డైలీ, వీక్లీ, మంత్లీ పాస్‌ల చార్జీలు ఏ మేరకు ఉండాలనేది ఖరారైన వెంటనే ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు తెలిపారు.

డైలీ, వీక్లీ, మంత్లీ వారీగా ప్రణాళిక

సిటీ బస్సు, మెట్రో రైలులో ప్రయాణం

చార్జీల చెల్లింపుపై త్వరలో స్పష్టత

హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎల్‌అండ్‌టీ మెట్రో, ఆర్టీసీల మధ్య సమన్వయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement