కొందుర్గు: పొట్టకూటి కోసం వందల మైళ్లు దాటుకొని వచ్చి జీవన పోరు సాగిస్తున్న ఓ వలస కూలీని పాముకాటు బలిగొంది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కొందుర్గులో చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన శాంతమ్మ(45), రంగస్వామి దంపతులు. వీరితోపాటు మరో పదిమంది వారం రోజుల క్రితం కూలి పనుల కోసం లూర్దునగర్‌కు చెందిన పోతిరెడ్డి శౌరెడ్డి వద్దకు వచ్చారు. శుక్రవారం అందరూ కలిసి ఉమ్మెంత్యాల గ్రామంలో శౌరెడ్డికి చెందిన కౌలుకు తీసుకొని సాగుచేసిన పత్తి పంటలో కలుపు తీయడానికి వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం శాంతమ్మను పెంజర పాము కాటు వేసినట్లు తోటి కూలీలు గమనించారు. వెంటనే చికిత్స కోసం కొందుర్గు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


