ఆక్రమణలకు రాచమార్గం! | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలకు రాచమార్గం!

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

పట్టించుకోవడం లేదు

శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కొంతమంది ‘పెద్దలు’ గద్దల్లా వాలిపోతున్నారు. అమాయక పేద రైతులను ముందుంచి తెరవెనుక భారీ భూ దందాకు తెగబడుతున్నారు. తర్వాత తమ అధికారం, ఆర్థిక బలాన్ని అడ్డు పెట్టుకుని ఏ దారి లేని ఇనాం పట్టా భూములకు ప్రభుత్వ భూముల నుంచి రాచమార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కళ్లముందే ఖరీదైన భూములు కరిగిపోతున్నా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోందే తప్ప.. ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.

కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో..

మహేశ్వరం మండలం కొంగరకుర్దు–ఎ (కలెక్టరేట్‌కు అత్యంత సమీపం)లో భూ ఆక్రమణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటికే కొంత మంది తమ బినామీల పేరున వివాదాస్పద వక్ఫ్‌/ ఇనాం, లావుణి, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ భూములను కొనుగోలు చేశారు. వీటికి నకిలీ ఓఆర్‌సీలు సృష్టించి మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు చేయించారు. ఖాళీ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. ఈ రెవెన్యూ పరిధిలోని దాదాపు అన్ని సర్వే నంబర్లపై ఒకవైపు హైకోర్టులో కేసు కొనసాగుతుండగా.. మరోవైపు అగ్రిమెంట్లు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఓ ఇద్దరు రైతుల నుంచి భూములను ఇటీవల కొనుగోలు చేసిన ఓ రియల్టర్‌ ఏకంగా ప్రభుత్వ భూమి నుంచి యథేచ్ఛగా తన వెంచర్‌కు రహదారి (12 మీటర్ల వెడల్పు, 1,545 మీటర్ల పొడవు) వేస్తున్నాడు. లే అవుట్‌ పర్మిషన్‌ కోసం మూడు నెలల క్రితం హెచ్‌ఎండీఏను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ భూముల్లో లే అవుట్‌కు అనుమతి ఇవ్వాలంటే కనీసం 30 ఫీట్ల రోడ్డు ఉండాలనే నిబంధన ఉంది. ఎలాగైనా తన వెంచర్‌ అనుమతులకు మార్గం సుగమం చేసుకోవాలని భావించిన సదరు రియల్టర్‌ ఇనాం రైతుల ముసు గులో ముందు భాగంలో ఉన్న రైతులు దీనికి అడ్డుతగులకుండా కోర్టు నుంచి ఓ ఆర్టర్‌ తీసుకొచ్చినట్లు సమాచారం. రియల్టర్‌ వేస్తున్న రోడ్డుతో ప్రభుత్వం సుమారు రూ.120 కోట్ల విలువ చేసే పది ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోంది.

టీజీఐఐసీ సేకరించిన భూమి

సర్వే నంబర్‌ 289లో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పారిశ్రామిక అవసరాల పేరుతో ప్రభుత్వం ఇప్పటికే ఈ సర్వే నంబర్‌లోని మొత్తం భూమిని టీజీఐఐసీ ద్వారా సేకరించింది. అప్పటి వరకు పొజిషన్‌లో ఉన్న అసైన్డ్‌ రైతులకు నష్టపరిహారం సైతం చెల్లించింది. దీనికి ఆనుకుని కింది భాగంలో ఉన్న మరికొంత మంది ఇనాం రైతులను ఓ రియల్టర్‌ సాకుగా చూపించి.. త్వరలో రూపుదిద్దుకోబోతున్న తన వెంచర్‌కు రేడియల్‌ రోడ్డు మీదుగా కొత్తగా మరో దారిని ఏర్పాటు చేసుకునేందుకు యత్నిస్తున్నాడు. ఎవరైనా పేదలు గజం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తేనే అడ్డుపడే అధికారులు అదే కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఖరీదైన భూమి హారతి కర్పూరంలా కరిగిపోతున్నా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీజీఐఐసీ సేకరించిన ఈ భూమిని కాపాడాలని కోరుతూ ఇప్పటికే పలువురు స్థానిక రైతులు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఓ రియల్టర్‌ తన వెంచర్‌కు ప్రభుత్వ భూమి నుంచి వేస్తున్న రహదారి

జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

కొంగరకుర్దులో కబ్జాల పర్వం

ఇప్పటికే ఫేక్‌ ఓఆర్సీలతో మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు

వివాదాస్పద వక్ఫ్‌, ఇనాం, లావుణి భూముల్లో వెంచర్లు

సర్వే నంబర్‌ 289 నుంచి దర్జాగా ప్రైవేటు వెంచర్‌కు రోడ్డు

పట్టించుకోని అధికార యంత్రాంగం

రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు అవసరమైన నక్షబాట ఇప్పటికే ఉంది. దీని నుంచి ఎవరైనా రాకపోకలు సాగించొచ్చు. సర్వే నంబర్‌ 291, 292లో భూములు కొనుగోలు చేసిన కొంత మంది తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్వే నంబర్‌ 289లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా రోడ్డు వేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

– రచ్చ లక్ష్మణ్‌, కొంగరకుర్దు నివాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement