న్యూస్‌రీల్
నిబంధనలు ఉన్నా..
నిర్వహణ లోపంతో
తరచూ ప్రమాదాలు
● మృత్యువాతపడుతున్న అమాయకులు
● పట్టించుకోని పాలకులు
‘జూన్ 27న మీర్‌పేట్ హనుమాన్‌నగర్‌లో అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ నాలుగో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే నెలలో ఖైరతాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ లేకపోయినా తలుపు తెరుచుకోవడంతో మనువడితో కలిసి ఓ మహిళ లిఫ్ట్ షాప్ట్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, చిన్నారి తీవ్ర గాయాలతో బయటపడింది. మూడు నెలల క్రితం ఆర్సీపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేయని లిఫ్ట్‌లో చిక్కుకున్న నాలుగున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు’
‘వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ(45)తో కలిసి రెండు రోజుల క్రితం చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చాడు. రెండో అంతస్తులో ఉన్న బంధువుల ఇంటికి చేరుకునేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ రిపేరులో ఉండటం, ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, ఈ విషయం తెలియక అందులో ఆమె కాలు పెట్టిన వెంటనే డోర్ మూయకుండానే కదలడంతో లిఫ్ట్ మధ్యలో కాలు ఇరుక్కుపోయి మృతి చెందింది’.
‘ఝూర్ఖండ్‌కు చెందిన బిల్దుఘోష్ గౌలిదొడ్డిలోని మహి ఉమెన్స్ పీజీ హాస్టల్‌లో వంటమనిషిగా పని చేస్తున్నాడు. అతని ఐదేళ్ల కుమార్తె బిస్టూఘోష్‌తో కలిసి అదే హాస్టల్‌లో ఉంటున్నాడు. మే 13న బిస్దూఘోష్ ఆడుకుంటూ లిఫ్ట్‌లో ఐదో అంతస్తుకు చేరుకుంది. తిరిగి కిందకు వస్తుండగా, తల వెనుక భాగం గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుని తల నుజ్జునుజ్జయి పాప చనిపోయిుుంది.’
‘గతేడాది మే 27న నాగోల్‌లోని ఓ హోటల్‌లో లిఫ్ట్ కేబుల్ తెగి ఎనిమిది మంది గాయపడ్డారు. జులై 27న తుకారాం గేట్‌లో 68 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. జులై 15న హఫీజ్‌పేటలో లిఫ్ట్ వైరు తెగిపడి ఒకరు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆగస్టు 26న గుడిమల్కాపూర్‌లో లిఫ్ట్ పైకప్పు కూలి 65 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. మార్చి 12న సంతోష్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో చిక్కుకుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిత్యం ఏదో ఒక చోట లిఫ్ట్/ఎస్కలేటర్ ప్రమాదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అనేక మంది మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ నియంత్రణ, నిర్వహణ పాలసీని తీసుకురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తెగిపడుతున్న వైర్లు..
మధ్యలో ఆగిపోతున్న లిఫ్ట్‌లు
నిర్మాణ ఖర్చులు తగ్గించుకునేందుకు కొంత మంది బిల్డర్లు తక్కువ ధరకు లభించే లిఫ్ట్ పరికరాలను అమర్చుతున్నారు. వీటిపై సరైన నియంత్రణ, నిర్వహణ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెజార్టీ భవనాల్లో ఇన్వర్టర్లు లేకపోవడం, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో లిఫ్ట్ మధ్యలో ఆగిపోతోంది. లిఫ్ట్ లోపల బాడీ చుట్టూ స్టీలు రేకు కవర్ అమర్చుతుండడం, లోపల సరైన గాలి, వెలుతురు లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసినా అందుబాటులో ఎవరూ ఉండక పోవడం, సామర్థ్యానికి మించి బరువును లిఫ్ట్‌లో ఎక్కిస్తుండడంతో వైర్లు తెగిపడుతున్నాయి. డోర్లు తెరుచుకునే సమయంలోనూ సెన్సార్లు పని చేయక లిఫ్ట్ ఎక్కే వారు మధ్యలో ఇరుక్కుపోతున్నారు. కొంత మంది మృత్యువాతపడుతుంటే.. మరికొందరు కాళ్లు, చేతులు కోల్పోతున్నారు.
ముసాయిదా బిల్లుకు మెరుగులు
ఈ ప్రమాదాలకు చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో అమల్లో ఉన్న లిఫ్ట్ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. అధ్యయనం, ముసాయిదా రూపకల్పనకు రెండేళ్ల క్రితం ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఆ బాధ్యతను తెలంగాణ విద్యుత్ తనిఖీ విభాగం చేపట్టింది. 2015లో ప్రభుత్వానికి పంపిన ముసాయిదాను పరిశీలించింది. తెలంగాణ లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ యాక్ట్–2025ని రూపొందించాలని నిర్ణయించింది. అయితే ఆ బిల్లు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
ఏటా పది వేలల్లో అమ్మకాలు
అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యూపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) ఇవ్వడానికి పురపాలకశాఖ జారీ చేస్తున్న జీఓ 168లో లిఫ్ట్ ఏర్పాటు ప్రస్తావన ఉన్నా.. నాణ్యత, నిర్వహణ, నియంత్రణపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇది లిఫ్ట్ తయారీ యంత్రాల కంపెనీలకు కలిసి వచ్చింది. తెలంగాణ ఎలివేటర్స్ అండ్స్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా పదివేలకుపైగా ఎలివేటర్ల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. వీటిలో 20 శాతం మాత్రమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు ఉన్నట్లు అంచనా. తయారీ సంస్థల వద్ద ఐదారేళ్లు పని చేసిన కార్మికులు.. సొంతంగా ఎలివేటర్లను తయారు చేస్తున్నారు. వీరు బిల్డర్ల వద్ద తక్కువ ధరకు కాంట్రాక్టులు తీసుకుని, నాసిరకం పరికరాలను అమర్చుతున్నారు.
బీఐఎస్ నిబంధనల ప్రకారం లిఫ్ట్‌ను నిర్మించే సమయంలో ఎంత మంది ప్రయాణించొచ్చు? ఎంత బరువు మోయగలదు? వంటి అంశాలను స్పష్టం చేయాల్సి ఉంది. ప్రమాణాల మేరకు విద్యుత్ సరఫరా ఉందా? నాణ్యమైన ఆటోమెటెక్ డోర్లు, అత్యవసర ఫోన్, అగ్ని నిరోధక పరికరాలు, అత్యవసర బ్రేకింగ్ సిస్టం వంటి వాటిని ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. 20 ఏళ్లు పైబడిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. సాంకేతిక నిపుణులతో పీరియాడికల్ ఇన్‌స్పెక్షన్లు చేయించాాల్సి ఉన్నా.. పట్టించుకోక పోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.


