యాచారం: మొదట సర్వేనంబరు 127లోని అసైన్డ్ భూమి రీ సర్వే, ఆ తర్వాతే కబ్జా రైతులకు చెల్లించే పరిహారం చెల్లింపు స్పష్టత ఇస్తామని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో మొండిగౌరెల్లి అసైన్డ్ రైతులు, రాజకీయ పక్షాల నాయకులతో సమావేశమయ్యారు. సర్వేనంబరు 127లో కబ్జా సర్వేలో పట్టాదారు, పాసుపుస్తకాల్లో కంటే తక్కువ ఎకరాల చొప్పున లిస్టుల్లో రైతుల పేర్లు ప్రకటించారని.. రీ సర్వే నిర్వహించాలని వారం క్రితం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ రైతులతో అదనపు కలెక్టర్ సమావేశమై వెంటనే రీ సర్వే చేయిస్తానని.. ఆ తర్వాత మరోమారు సమావేశమై కబ్జా రైతుల పరిహారంపై తేల్చుతామన్నారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. పట్టాదారు, పాసుపుస్తకాలు కలిగిన రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం సర్పంచ్ కొలన్ రమాదేవి ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు, రైతులు, రాజకీయ పక్షాల నాయకులు కలిసి కబ్జా రైతులకు ఎకరాకు రూ.30లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


