ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నవీన్‌కుమార్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కామర్స్, హిస్టరీ, కెమిస్ట్రీ, జువాలజీ, సివిక్స్ బోధనకు జూనియర్ లెక్చరర్స్, ఇంగ్లిష్, ఉర్దూ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు, గణితం, సోషల్ స్టడీస్, సైన్స్‌లో టెన్త్ గ్రాడ్యుయేట్ టీచర్లు పాటు డీఈఓ, నర్సింగ్ ఆఫీసర్, పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డిగ్రీతో పాటు బీఈడీ, టెట్, సీటెట్ చేసిన వారు అర్హులన్నారు. ఈ నెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
మహేందర్‌రెడ్డి
మొయినాబాద్/మొయినాబాద్ రూరల్: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సామల మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన అజీజ్‌నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ, బాకారం, అమ్డాపూర్, వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి తదితర ప్రభుత్వ పాఠశాలల్లో పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఆర్‌సీ, సీపీఎస్ రద్దు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లతో సెప్టెంబర్ 1న నగరంలోని ఇందిరా పార్కు వద్ద సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులంతా ధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులకు సభ్యత్వాన్ని అందజేశారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు బందయ్య, గౌరవ అధ్యక్షుడు హమీద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శివకుమార్, సంఘం నాయకులు శివకుమార్, లక్ష్మణ్, వేణుగోపాల్, రాములుగౌడ్, బీమ్లా, జంగయ్య, వినోద్‌కుమార్, నారాయణగౌడ్, వేణు, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, రాములునాయక్, విక్రమ్, సురేందర్‌రెడ్డి, రవి, భగీరథ తదితరులు పాల్గొన్నారు.
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన పోక్సో కేసులో నిందితుడికి ఎల్.బి.నగర్ న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. యూపీకి చెందిన సోనూ చక్రవర్తి (21) షాహిన్‌నగర్‌లో నివాసం ఉంటూ స్వీట్‌కార్న్ విక్రయిస్తుండేవాడు. 2025లో పక్కింట్లో నివాసం ఉండే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని జాఫర్‌గూడలో ఆక్రమణకు గురవుతున్న చెరువు అలుగుతో పాటు నక్షబాటను బుధవారం ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు, ఏఈ శ్రీవాణి పరిశీలించారు. నోవా విద్యాసంస్థల యాజమాన్యం చెరువు అలుగుతో పాటు, బాటను ఆక్రమించుకుంటుందని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు చెరువు పరిసరాలను పరిశీలించి అలుగు వద్ద చేపడుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. అధికారుల వెంట సర్పంచ్ ఎర్ర వెంకటేష్‌యాదవ్, మాజీ ఉప సర్పంచ్ దేశట్ల శేఖర్‌యాదవ్, నాయకులు బక్కతట్ల జంగయ్య, కోటా వెంకట్‌రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.


