చేవెళ్ల: ప్రజలకు పోలీసుల ఉనికి తెలిసేలా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని ప్యూచర్‌సిటీ సీపీ తరుణ్ జోషి అన్నారు. బుధవారం ఆయన చేవెళ్ల ఠాణాను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, కేసులు, లాకప్‌లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని సూచించారు. అనంతరం పీఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, ఏసీపీ బి.కిషన్, సీఐ కట్టా నరేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరావు, శిరీష, తేజశ్రీ, సిబ్బంది తదితరులు ఉన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
మొయినాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని.. వాటి పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఫ్యూచర్‌సిటీ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. ‘సైబర్ జాగ్రుక్తా దివస్’సందర్భంగా బుధవారం మున్సిపల్ పరిధిలోని విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సైబర్ స్టాకింగ్, లోన్ యాప్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయని.. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మి వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దన్నారు. సోషల్ మీడియా వినియోగంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని.. వ్యక్తిగత వివరాలను, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను ఎవరికీ షేర్ చేయవద్దన్నారు. బలమైన పాస్‌వర్డ్‌లు వినియోగించాలన్నారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సైబర్ అవగాహన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సైబర్ భద్రతను ప్రోత్సహిస్తూ ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్’అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల డీసీపీ యోగేశ్‌గౌతమ్, ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఐ వెంకన్న, కళాశాల ప్లేస్‌మెంట్ డైరెక్టర్ వెంకటాచలం, హెచ్‌ఓడీ నాగేశ్వర్‌రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి


