యాచారం: అక్రమ ఫాంల్యాండ్స్‌పై పంచాయతీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు రోజుల క్రితం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘ఫ్యూచర్‌సిటీలో రియల్ దందా’అనే కథనంపై జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ వివిధ మండలాల పంచాయతీ అధికారులకు ఫోన్లు చేసి అక్రమ ఫాంల్యాండ్స్‌ను ధ్వంసం చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు బుధవారం పంచాయతీ సిబ్బంది చౌదర్‌పల్లిలోని అక్రమ ఫాంల్యాండ్స్‌లో పాతిన హద్దురాళ్లు, బోర్డులు, స్తంభాలను తొలగించారు. ఫాంల్యాండ్స్ పేరుతో మామిడి తోటలోని వ్యవసాయ భూమిని గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేసిన విషయాన్ని గుర్తించారు. అక్రమ ఫాంల్యాండ్స్ పేరిట సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి, నందివనపర్తి తదితర గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన ఫాంల్యాండ్స్‌పై మండల పంచాయతీ అధికారి శ్రీలత వివరాలు సేకరించారు. అక్రమ ఫాంల్యాండ్స్‌ను కూల్చివేయాలని ఆయా గ్రామాల పంచాయతీ అధికారులను ఆదేశించారు.


