కొత్తూరు: అంత్యక్రియలు నిర్వహించిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన పాత్లావత్ నరేశ్(27) జేపీదర్గాలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. గత నెల 15న దర్గా నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఉస్మానియాకు తరలించారు. బాధితుడి అన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత పోలీసులు, ఆస్పత్రి వర్గాలకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు నరేశ్‌ను ఇంటికి తీసుకురాగా, రెండు రోజుల క్రితం మృతిచెందాడు. దీంతో అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. నరేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తంకావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మంగళవారం ఉస్మానియా నుంచి వచ్చిన నలుగురు వైద్యుల బృందం పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించింది.
ఫాక్స్‌కాన్ ఉద్యోగుల గదుల్లో చోరీ
దొంగతనాలకు పాల్పడుతున్న డార్మిటరీ సూపర్‌వైజర్
ఇబ్రహీంపట్నం రూరల్: ఫాక్స్‌కాన్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న వియత్నాం దేశానికి చెందిన ప్రతినిధుల గదుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రమేశ్ తెలిపిన ప్రకారం. రోచీష్మతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వియత్నాం దేశానికి చెందిన ఫాక్స్‌కాన్ ఉద్యోగుల గదుల్లో అదే డార్మిటరీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మారినేని చిన్న వెంకటరావు నగదు దొంగిలిస్తున్నాడు. ఓ ఉద్యోగి పెట్టిన స్పై కెమెరాలో చోరీకి పాల్పడిన వీడియో రికార్డయింది. రూ.7 వేలు నగదు దొంగిలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అపార్ట్‌మెంట్‌లోని ఆరు ఇళ్లలో రూ.లక్ష వరకు నగదు అపహరించాడని బాధితులు ఫిర్యాదు చేశారని.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాచిగూడ: ప్రజాభిప్రాయం మేరకు ఫార్మాసిటి / ప్యూచర్ సిటి ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయాలని ఫార్మాసిటీ జ్యూరీ కమిటీ ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టు వసంత లక్ష్మీ, మానవహక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, రిటైర్డ్ తహసీల్దార్ వి.బాలరాజ్, డాక్టర్ జి.విజయ్ డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ నివేదికను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సహాయంతో తాము మరికొంత మందితో కలిసి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిపారు. అనేక గ్రామాల్లోని, తండాల్లో రైతులను కలవడం జరిగిందని వారు ఫార్మా సిటీకి భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదని, రైతుల భూములన్నింటిని భూసేకరణ నుంచి పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. భూములు ఇవ్వని రైతుల పేర్లను వెంటనే భూభారతి అన్‌లైన్ రికార్డులలో పునరుద్ధరించాలని, వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ హక్కులను కల్పించాలని అన్నారు. కోర్డు ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం సేకరించిన భూములను స్వాధీనం చేసుకోరాదని, గ్రామాల నుంచి భారీ యంత్రాలను తొలగించాలని, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని అన్నారు. కార్యక్రమంలో కన్నెగంటి రవి, కవుల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.


