సాక్షి, సిటీబ్యూరో/మాదాపూర్: డాక్టర్ ప్రిస్క్రిప్సన్ లేకుండా..అక్రమంగా ట్రమడాల్ మాత్రలు (అధిక మోతాదు పెయిన్ కిల్లర్స్) విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 6568 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఇన్స్‌పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన మేరకు..విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సాయినగర్‌లోని ప్రైమ్ ఫార్మసీపై దాడి చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్లు, చట్టబద్ధమైన రికార్డులు లేకుండా ట్రమడాల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ప్రైమ్ ఫార్మసీ యజమాని తొర్రి వెంకటేశం, డెలివరీ బాయ్ బర్లకాడి శ్రీకాంత్‌లను అరెస్ట్ చేశారు. నారాయణ ఖేడ్‌కి చెందిన మరో నిందితుడు రాథోడ్ ప్రకాశ్ పరారీలో ఉన్నాడు. ఇతను మాత్రలను అక్రమంగా సేకరించి ఫార్మసీలోనూ..డెలివరీ బాయ్ ద్వారా వినియోగదారులకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. సుమారు 100 నుంచి 150 మంది వినియోగదారులకు ఈ మాత్రల్ని సరఫరా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని అధిక మత్తుకోసం డ్రగ్స్‌లా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.
ఫుడ్ లైసెన్స్ ముసుగులో హెచ్ కేటగిరీ మందుల తయారీ
ఆహారం, న్యూట్రాస్యూటికల్ ముసుగులో హేబిట్యువల్ డ్రగ్స్(హెచ్ కేటగిరీ) తయారీని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)అధికారులు గుర్తించా రు. బుధవారం మలక్‌పేట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా మేడ్చల్ మల్కాజ్‌గిరి ఫేజ్–2లోని గోతిక్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో గబాజెన్ మాత్రలు తయారు చేసి, నగరానికే చెందిన సిఫ్కో ఆయుస్టార్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నట్లు తేల్చా రు. తీసుకున్న లైసెన్సుకు..తయారు చేసే ఉత్పత్తికి తేడాలున్నాయి. షెడ్యూల్డ్–ఎం తయారీ పద్ధతులు, ఇండియన్ ఫార్మకోపియా నాణ్యత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని డీసీఏ అధికారులు పేర్కొన్నారు. ఫుడ్ లైసెన్స్ పేరుతో మందులు విక్రయిస్తున్నారని తేలిందని తెలిపారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ ఏడీ రాజమౌళి, మలక్‌పేట్ డీఐ అనిల్ పాల్గొన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్, 6,586 టాబ్లెట్లు స్వాధీనం


