శంకర్‌పల్లి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి కొండకల్ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. కొండకల్ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి(40) మృతదేహం పడి ఉంది. గమనించిన లైన్‌మెన్ వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి, వికారాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కదులుతున్న రైలు నుంచి పడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
కారు ఢీకొని..
అబ్దుల్లాపూర్‌మెట్: రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తిని అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని టాటా మోటార్స్ ఎదురుగా విజయవాడ జాతీయ రహదారి పక్కనే బుధవారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) నిలబడి ఉన్నాడు. అదే సమయంలో విజయవాడ–హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న ఓ కారు డ్రైవర్ అతి వేగంగా వచ్చి అతని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు చెత్త ఏరుకుని జీవనం సాగించే రమేశ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికికి తలరించారు. కేసు దర్యాప్తులో ఉంది.


