యాచారం: ఫ్యూచర్‌సిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజీ నిర్మాణాలకు భారీగా నిధులు మంజూరవుతున్నాయి. గతంలో మట్టి రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడిన ప్రజలు ప్రస్తుతం మెరుగైన మౌలిక సదుపాయాలు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం యాచారం, కందుకూర్, కడ్తాల్ మండలాల్లోని పది గ్రామాల్లో 19,333 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయించగా, సుమారు 13,500 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లోనే టీజీఐఐసీ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మండలానికి మరో రూ.పది కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.
రెండేళ్లలో రూ.40 కోట్లు
ఇటీవల యాచారం మండలంలోని 12 గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి మరో రూ.12 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మంతన్‌గౌరెల్లి, యాచారం, చింతపట్ల, మొండిగౌరెల్లి, చింతుల్ల, నందివనపర్తి, కేసీ తండా, కొత్తపల్లి తదితర గ్రామాల్లో పనులు చేపట్టనున్నారు. ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చిన 24 గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రతిపాదనల ఆధారంగా ఈ నిధులు విడుదలయ్యాయి. గత రెండేళ్లలో యాచారం మండలానికి టీజీఐఐసీ ద్వారా సుమారు రూ.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. యాచారం, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తవుతున్నాయి. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది.
యాచారం మండలానికి
రూ.10 కోట్లు మంజూరు
వేగంగా సీసీ రోడ్లు,
డ్రైనేజీ కాల్వల నిర్మాణం
ఆయా గ్రామాల్లో విస్తృతంగా
అభివృద్ధి కార్యక్రమాలు
అభివృద్ధి పనులు..
ఫ్యూచర్‌సిటీని దృష్టిలో పెట్టుకుని టీజీఐఐసీ కావాల్సిన నిధులను మంజూరు చేస్తోంది. ఎమ్మెల్యే రంగారెడ్డి ఆదేశాల ప్రకారం నివేదికలు పంపిన వెంటనే నిధులు ఇస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో రూ.30 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. తాజాగా వచ్చే రూ.10 కోట్లతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం.
– శ్రీనివాస్, డీఈఈ, పంచాయతీరాజ్ శాఖ
హామీ ఇచ్చారు
కొద్ది రోజుల కింద మండల సర్పంచులమంతా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిశాం. గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రాలిచ్చాం. కావాల్సిన నిధులను టీజీఐఐసీ ద్వారా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మంతన్‌గౌరెల్లి గ్రామానికి రూ.రెండు కోట్లకు పైగా నిధులు అడిగాను.
– అరవింద్‌నాయక్, సర్పంచ్, మంతన్‌గౌరెల్లి


