భవనం పైనుంచి పడి బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

భవనం పైనుంచి పడి బాలుడి మృతి

Aug 5 2026 8:39 AM | Updated on Aug 5 2026 8:39 AM

తాండూరు టౌన్‌: ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ పైనుంచి పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం గాంధీనగర్‌లోని తన తాత ఇంట్లో ఆడుకుంటున్న 18 నెలల దీక్షిత్‌ రెండవ అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం బాలున్ని జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఎంసీహెచ్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాలున్ని హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి

మోమిన్‌పేట: ఇరవై ఏళ్లుగా ఉపాధి హామీ (వీబీజీరామ్‌జీ) పథకంలో పనిచేస్తున్న తమను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని పథకం సిబ్బంది కోరారు. ఈ మేరకు మంగళవారం శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఆరోగ్య బీమా, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడంతో పాటు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది, ఫీల్డ్‌అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

తలకు గాయమై, నోట్లోంచి రక్తం కారి..

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

మోతీనగర్‌: కూకట్‌పల్లి ప్రాంతంలోని అల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడని సీఐ ఎస్‌.నవీన్‌కుమార్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాటవరం గ్రామానికి చెందిన దండుపాటి రాము, మంగ దంపతులు పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. శ్రీ వివేకానందనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో అతడు వాచ్‌మేన్‌గా పనిచేస్తూ ఓ ప్రైవేట్‌ స్కూలులో నివసిస్తున్నారు. అయితే రాము తరచూ తాగి రాత్రిపూట స్కూల్‌ బిల్డింగ్‌పై నిద్రించేవాడు. సోమవారం రాత్రి కూడా బిల్డింగ్‌పైకి ఎక్కిన రాము తెల్లవారినా కిందికి రాలేదు. అక్కడే టీ షాపు నడిపే రామారావు వచ్చి స్కూల్‌ పక్కన ఉన్న కార్‌ కేర్‌ సర్వీస్‌ సెంటర్‌లో రాము పడిపోయి ఉన్నాడని మంగకు చెప్పాడు. ఆమె వెళ్లి చూడగా తలకు గాయమై, నోట్లో నుంచి రక్తం కారుతూ మృతి చెంది ఉన్నాడు. మద్యం మత్తులో కారుషెడ్డు రేకుల మీద నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మిషన్‌ అదుపు తప్పి..

మెడపై పడడంతో గాయపడిన యువకుడు మృతి

అంబర్‌పేట: ఇంటి మరమ్మతులు చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు. అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం... అంబర్‌పేట ఆకాశ్‌నగర్‌కు చెందిన కాశీంఖాన్‌ కుమారుడు షాకీర్‌ఖాన్‌(21) బాగ్‌ అంబర్‌పేట తురాబ్‌నగర్‌లో ఇంటి మరమ్మతు పనికి వెళ్లాడు. కట్టింగ్‌ మిషన్‌తో పనులు చేస్తుండగా అది అదుపు తప్పి అతడి మెడ భాగంలో పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాశీంఖాన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement