పహాడీషరీఫ్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మయ్య మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన మహ్మద్ వాజిద్, వసీం బేగం(26) దంపతులకు ఇద్దరు పిల్లలు అలీనా(3), సాద్(1)లు సంతానం. గత నెల 31వ తేదీన వాజీద్ తన సొంతూరుకు వెళ్లాడు. అదే రోజు రాత్రి భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా భార్య, పిల్లలు కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై వాజిద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
వ్యవసాయ మోటార్
పరికరాల చోరీ
తుక్కుగూడ: వ్యవసాయ మోటార్ పరికరాలు చోరీకి గురైన సంఘటన రావిర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. రైతులు జల్లాల రమేష్, జల్లాల పాండు, బత్తుల ఆంజనేయులు, నక్క సురేష్ వ్యవసాయ పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి సమయంలో మోటార్ కేబుల్ వైర్లు, స్టార్టర్లు, ఎరువుల బస్తాలు తదితర పరికరాలను అపహరించారు. రైతులకు రూ.లక్షల్లో నష్టం జరిగింది. పోలీసులు స్పందించి చోరీ ముఠాను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


