● అరకొర బస్సులతో తప్పని పాట్లు
● ఇబ్బంది పడుతున్న వృద్ధులు, దివ్యాంగులు
మొయినాబాద్: అరకొర బస్సులతో వృద్ధులు, దివ్యాంగులకు పాట్లు తప్పడంలేదు. రద్దీ సమయాల్లో బస్సులు తక్కువగా ఉండటంతో సమస్య మరింత జఠిలమవుతోంది. మంగళవారం చేవెళ్ల నుంచి వచ్చిన ఓ బస్సు మొయినాబాద్ స్టాప్‌లో ఆగింది. వెంటనే అక్కడున్న విద్యార్థులంతా ఎగబడ్డారు. ఈసమయంలో బస్సులోనుంచి దిగుతున్న ఓ వృద్ధురాలు కిందపడిపోయింది. నిత్యం ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు. ముఖ్యంగా మొయినాబాద్ మీదుగా వందల సంఖ్యలో బస్సులు నడుస్తున్నా కిక్కిరిసిన ప్రయాణమే సాగుతోంది. ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కళాశాలలు అధికంగా ఉండటంతో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. కళాశాలల సమయంలో సరిపడా బస్సులు లేకపోవడంతో వచ్చిన బస్సు ఎక్కేందుకు విద్యార్థులు ఎగబడతారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో రద్దీ మరింత పెరిగింది.


