యాచారం: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం బాధితులకు అందాల్సిన రిలీఫ్ ఫండ్‌ను వెంటనే విడుదల చేయాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ (డీబీఎస్‌యూ) నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ బోడ కృష్ణ, జిల్లా అసిస్టెంట్ కోఆర్డినేటర్ బడే భాగ్యమ్మ, ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యదర్శి బడే కుమార్ మాట్లాడుతూ.. బాధితులకు అందాల్సిన రిలీఫ్ ఫండ్ జిల్లాలో కొన్ని నెలలుగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ అయిన వెంటనే వారం రోజుల్లో అందజేయాల్సిన మొదటి దఫా రిలీఫ్ ఫండ్ కూడా అంద లేదని అన్నారు. యాచారం–13, ఇబ్రహీంపట్నం–11, మంచాల–22, తలకొండపల్లి–10, మాడ్గుల–6, ఆమనగల్లు–5, కందుకూరు–8 మంది బాధితులకు రిలీఫ్ ఫండ్ అందాల్సి ఉందని తెలిపారు. జాప్యం చేయడం సరైంది కాదని తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ త్వరలో అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


