యాచారం: ఫార్మాసిటీ భూముల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా టీజీఐఐసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. యాచారం, కందుకూరు మండలాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 13,500 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించారు. ఏడాది కాలంగా హద్దుల గుర్తింపు, ఫెన్సింగ్ పనులు పూర్తి చేసి ప్రస్తుతం చదును పనులు చేస్తున్నారు. రైతులకు పరిహారం చెల్లించినప్పటికీ మళ్లీ సదరు భూముల్లోకి రావడం, పంటలు సాగు చేయడం వంటి ఘటనలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రకాల పరిశ్రమలకు భూములు అప్పగించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.
28 కంటైనర్ల ఏర్పాటు
ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో పటిష్టమైన నిఘా కోసం (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిసదుపాయాల సంస్థ) సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రతీ 500 ఎకరాలకు ఒకటి చొప్పున మొత్తం 28 కంటైనర్లు, వీటి వద్ద ఒక సీసీ కెమెరా (నాలుగు కెమెరాలుండే స్తంభం) ఏర్పాటు చేశారు. ప్రతీ కంటైనర్ వద్ద ఓ ప్రైవేటు ఉద్యోగిని నియమించి రూ.15 వేలకుపైగా జీతం చెల్లిస్తున్నారు. ఇందుకోసం స్థానికులనే ఎంచుకుంటున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ భూముల్లోకి వెళ్లేందుకు రైతులు సాహసించడం లేదు.
ఫ్యూచర్‌సిటీ పోలీసుల పర్యవేక్షణ
ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో మొదటి నుంచి పోలీసుల రక్షణ వలయం ఉంది. నాటి రాచకొండ కమిషనరేట్ నుంచి ప్రస్తుత ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వరకు గట్టి బందోబస్తు కొనసాగుతోంది. ఫార్మాసిటీ భూముల్లో టీజీఐఐసీ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ సిబ్బంది అనుక్షణం పరిశీలిస్తారు. ఫార్మాసిటీ భూముల్లో ఏ చిన్న వస్తువు చోరీకి గురైనా క్షణాల్లోనే తెలిసిపోయేలా సీసీ కెమెరాలకు అలర్ట్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు టీజీఐఐసీ ఉన్నతాధికారి వరుణ్ తెలిపారు.
ప్రతీ 500 ఎకరాలకు
ఒక కంటైనర్, సీసీ కెమెరాల స్తంభం
ప్రత్యేక సిబ్బందితో పగలు, రాత్రి పర్యవేక్షణ
చీమ చిటుక్కుమన్నా
తెలిసిపోయేలా ఏర్పాట్లు


