జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీ
ఇబ్రహీంపట్నం రూరల్: తల్లిపాల వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీ శుక్రవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, రోగ నిరోధక శక్తి, ఆరోగ్యకరమైన ఎదుగుదల, దీర్ఘకాలిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ద్వారా నవజాత శిశు మరణాలు తగ్గించవచ్చన్నారు. దీనిపై సామాజిక, కుటుంబ భాగస్వామ్యంపై అవగాహన కల్పించాలని కోరారు.
మొయినాబాద్: భాస్కర మెడికల్ కళాశాలపై విచారణ చేపట్టాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ)ను ఆదేశించింది. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూలో ఉన్న భాస్కర మెడికల్ కళాశాలలో ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం పెరిగిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సౌకర్యాలు, ఆస్పత్రి వసతులు లేవని.. విద్యార్థులకు ఇచ్చే స్టయిఫండ్ వివరాలను బహిర్గతం చేయడంలేదని ఇటీవల ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు దేవరాల రాజేష్ యాదవ్ ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్‌ఎంసీ కళాశాలలో సంబంధిత అంశాలపై సమగ్ర విచారణ జరిపి, తీసుకున్న చర్యల నివేదికను వారం రోజుల్లోగా పంపాలని డీఎంఈకి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ.. కళాశాలలోని సదుపాయాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆమనగల్లు: మండలంలోని ఆకుతోటపల్లిలో ఏర్పాటయ్యే క్వారీ, స్టోన్ క్రషర్ స్థలాన్ని శుక్రవారం వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. గ్రామంలోని సర్వే నంబర్ 302,304లో క్రషర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని జిల్లా మైనింగ్ అధికారి ఇందిర, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూశాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా క్రషర్ ఏర్పాటు వద్దని గ్రామస్తులు విన్నవించారు. క్రషర్ ఏర్పాటుతో దుమ్ము, ధూళితో సమీపంలో ఉన్న పొలాలు, పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని వివరించారు. నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని అధికారులు తెలిపారు.
మొయినాబాద్‌రూరల్: కురుస్తున్న వర్షాలతో ఈసీ వాగు వరద నీటితో ప్రవహిస్తోంది. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతమైన వికారాబాద్, పరిగి ఆయా ప్రాంతాల నుంచి మొదలైన ఈసీవాగు శుక్రవారం ఉదయం వరద నీటితో ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్‌లోకి నీరు చేరుతోంది. కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఈసీ వాగు పారుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


