ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నవాడ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కేశవ మెమోరియల్ కళాశాలలో శుక్రవారం ఫీజుల బకాయి–బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బకాయిలు విడుదలకాకపోవడంతో రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 3,200 ఇంటర్మీడియెట్ కళాశాలలు, 2,700 డిగ్రీ కళాశాలలు, 2,800 పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యావ్యవస్థను కాపాడాలని కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు పుప్పాల శాంతికుమార్, వినయ్, శశిధర్‌రెడ్డి, సందీప్, సంతోష్, శ్రీకాంత్, పవన్ పాల్గొన్నారు.


