సాక్షి, సిటీబ్యూరో: వ్యాధుల సీజన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉన్న బస్తీ దవాఖానాలను బలోపేతం చేయాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖాళీలను సత్వరం భర్తీ చేయాలని హైదరాబాద్ కలెక్టర్‌ను కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు. దీంతో సోమవారం నుంచి సుమారు 20 మంది వరకు కొత్త వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగరమంతటా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రులను వరుస తనిఖీలు చేస్తున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ హెచ్చరిస్తున్నారు.
హైరిస్క్ జాబితాలు సిద్ధం
హైదరాబాద్ జిల్లాలో 169 బస్తీ దవాఖానాలు, 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. సాధారణ రోజులతో పోల్చితే ఓపీ సుమారు 20 శాతానికిపైగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలోని కొన్ని బస్తీ దవాఖానాల్లో నిత్యం ఓపీ వంద దాటుతోంది. ఇది సాధారణ రోజుల్లో 40 నుంచి 70 వరకు ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆస్పత్రి పరిధిలోని గర్భిణులు, వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వంటి వారితో హైరిస్క్ జాబితాలను సిద్ధం చేశారు. 1,037 హైరిస్క్ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. 1,220 ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ, 9,335 ప్రాంతాల్లో యాంటీ లార్వా (లార్వా రిజెక్షన్) కార్యక్రమాలు చేపట్టారు. ‘ఆస్పత్రుల్లో సిబ్బంది హాజరు, అందుతున్న ఆరోగ్య సేవలు, ఔషధాల లభ్యత, ల్యాబ్, వ్యాధి నిరోధక టీకాల లభ్యత, తదితర అంశాలపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందన్న భరోసా కల్పించే విధంగా సిబ్బంది సేవలు ఉండాలి. ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సహాయ సిబ్బంది అంతా తప్పనిసరిగా సమయపాలన పాటించాల్సిందే’ అని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ ఇటీవల సమీక్ష సమావేశం సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు.
ముగిసిన ఫీవర్ సర్వే
క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధుల ప్రభావం తెలుసు కునేందుకు జ్వర సర్వే చేపట్టారు. జూలై 31తో ముగిసిన సర్వేలో మొత్తం 300 బృందాలు పాల్గొన్నాయి. 1,668 ప్రాంతాల్లో 90 వేలకుపైగా గృహాలను సందర్శించారు. 3,500 మందిని ఫీవర్ స్క్రీనింగ్ చేశారు. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల బృందం కుటుంబంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, ఇతర విష జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. తదుపరి చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
తగ్గిన కేసులు
గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం నగరంలో వ్యాధుల ప్రభావం తగ్గింది. 2025లో 1,481 డెంగీ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 280 కేసులు మాత్రమే నమోదయ్యాయి. చికున్‌గున్యాకు సంబంధించి ఒక్క కేసూ లేకపోగా.. గత ఏడాది 70 కేసులు నమోదయ్యాయి.
9,335 ప్రాంతాల్లో లార్వా రిజెక్షన్ కార్యక్రమాలు
1,037 హైరిస్క్ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు
గత ఏడాదితో పోల్చితే తగ్గిన డెంగీ కేసులు
సిబ్బంది సమయపాలన పాటించాలి: డీఎంహెచ్‌ఓ


