సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా అరుంధతి
షాద్‌నగర్: రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన అరుంధతి ఎన్నికయ్యారు. ఫరూఖ్‌నగర్ మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పని చేస్తున్న ఆమె ఇటీవల నిర్వహించిన బోర్డు ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. మహిళా సంఘాల బలోపేతం చెంది ఆర్థికాభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రిజిస్ట్రేషన్‌లు చేయొద్దని వినతి
షాద్‌నగర్‌రూరల్: మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి శివారు జగదాంబ ఫేజ్–2 వెంచర్‌లో రిజిస్ట్రేషన్‌లు చేయొద్దని కోరుతూ పలువురు ప్లాట్ల కొనుగోలుదారులు గురువారం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వెంచర్‌లో తాము ప్లాట్లు కొనుగోలు చేయగా కొందరు వ్యక్తులు హద్దులు తొలగించారని.. ఈ విషయమై తాము గతంలో షాద్‌నగర్ ఠాణాలోనూ ఫిర్యాదు చేశామన్నారు. కొందరు అక్రమార్కులు వెంచర్‌లోకి ప్రవేశించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయిచేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కిశోర్‌కుమార్, రాజేశ్, జగదీశ్వర్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు. ఆగస్టు 2న మెగా రక్తదాన శిబిరం
కడ్తాల్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 2న కడ్తాల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో తలసేమియా బాధితుల కోసం రక్తదానం శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ టీం (ఎఫ్‌ఎఫ్‌ఎల్‌టీ) సభ్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయిని కలిసి ప్రారంభోత్సవానికి హాజరవ్వాలని కోరారు. అనంతరం ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఆరోగ్యవంతుడు రక్తదానం చేసి తలసేమియా బాధితులకు అండగా నిలవాలని కోరారు. యువత స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్బు రమేశ్, సురేందర్, శ్రావన్‌కుమాక్, గౌసుద్దీన్, సంతోజు విక్రాంత్, శేఖర్ తదితరులు ఉన్నారు.
సంచార పశువైద్య సేవలు వినియోగించుకోవాలి
‘1962’ప్రోగ్రాం జిల్లా మేనేజర్ జాన్ షాహిద్
చేవెళ్ల: మూగజీవాల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జాన్ షాహిద్, జిల్లా అధికారి (ఈఎంఈ) శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా అధికారులు చేవెళ్లలోని పశువైద్యశాలలోని 1962 సంచార పశువైద్యశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యసేవల పనితీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పశువులకు అనారోగ్యం ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే 1962 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే సంచార పశువైద్య బృందం రైతు గడపకే చేరుకుని ఉచిత సేవలు అందిస్తుందని చెప్పారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.