ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఇన్‌చార్జి పీడీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎఫ్‌టీఈ ఉద్యోగులకు 2026 ఆగస్టు 15వ తేదీ లోపు పే స్కేల్ అమలు చేసి సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే విధానాన్ని, పెండింగ్‌లోని మూడు నెలల జీతాలను విడుదల చేయాలని, ఎస్‌ఆర్‌డీఎస్ బోర్డు సమావేశంలో ఆమోదించిన నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెలవు దినాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, రెగ్యూలర్ ఉద్యోగులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రయోజనాలు కల్పించాలన్నారు. సీఆర్‌డీ కార్యాలయంలో ఫైనాన్స్ వింగ్, హెచ్‌ఆర్ వింగ్ మధ్య సమన్వయ లోపాలను నివారించి వేతనాల విడుదలలో జాప్యాన్ని పరిష్కరించాలన్నారు. క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, పదోన్నతులు, బదిలీలు కేరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీ అమలు చేయాలని కోరారు.


