● టీజీఎస్‌పీడీసీఎల్ జిల్లా చీఫ్ ఇంజనీర్ పాండ్యనాయక్
● రూ.2.5 కోట్లతో జిల్లాలో తొలి పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
పహాడీషరీఫ్: విద్యుత్ వినియోగదారులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ చర్యలు తీసుకుంటుందని సంస్థ జిల్లా చీఫ్ ఇంజనీర్ పాండ్యనాయక్ అన్నారు. గురువారం జల్‌పల్లి సర్కిల్‌లోని వాదే హుదా సబ్‌స్టేషన్‌లో 16 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు జిల్లాలో తొలిసారిగా 33 కేవీ ఉప కేంద్రంలో రూ.2.5 కోట్లు వెచ్చించి ఈ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ని ఏర్పాటు చేశామన్నారు. వాదే ముస్తఫా, గౌస్‌నగర్, అలీనగర్, నూరీనగర్, ఇస్మాయిల్ నగర్, బాబానగర్, ఎర్రకుంట, క్యూబా కాలనీలలోని దాదాపు 12 వేల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎస్‌ఈ శ్రీరామ్ మోహన్, కందుకూరు డీఈ గోపాల కృష్ణ, ఎంఆర్టీ డీఈ భాస్కర్, లైన్స్ డీఈ చంద్రశేఖర్, ఏడీఈలు శంకర్, స్వాతి, రామలింగారెడ్డి, ఏఈలు సుమన్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.


