ఇబ్రహీంపట్నం రూరల్: మంగళ్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 78 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉండగా, ఇటీవలే మరో ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్ మీద పంపించారు. అటెండర్, స్వీపర్ అసలే లేరు. నాలుగు సబ్జెక్టులకు ముగ్గురు టీచర్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తరగతి గదులు మూడు మాత్రమే ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడిపోతున్నాయి. విద్యార్థులకు ఆరుబయటే పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. కిచెన్ షెడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరి వర్షం పడితే కురుస్తోంది.
చేవెళ్ల: చేవెళ్లలోని ప్రాథమిక బాలికల పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులులేవు. ఐదు గదుల్లో ఒకటి ఆఫీస్ రూమ్ మిగిలిన నాలుగింటిలో నాలుగు తరగతుల గదులకు పోగా ప్రీప్రైమరీ, ఒకటో తరగతులకు గదులు లేక వరండాలోనే పాఠాలు చెబుతున్నారు. సరిపడా గదులు లేక ఆఫీస్ రూమ్‌నే స్టోర్‌రూమ్‌గా వాడుతున్నారు. విద్యార్థులకోసం వచ్చిన కంప్యూటర్లు ఆఫీస్ రూమ్‌లోనే పడి ఉన్నాయి. చేవెళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరి తరగతి గదులు పెచ్చులూడిపోతున్నాయి. ప్రమాదకరంగా మారిన భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాములు తిరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
కొత్తూరు: మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 160 మంది విద్యార్థులు చదువుతుండగా మూడు గదులు మాత్రమే ఉన్నాయి. ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఇద్దరు డిప్యూటేషన్‌పై ఉన్నారు. పాఠశాల పక్కనే రైలు పట్టాలు ఉండడంతో చుట్టు ప్రహరీ లేక ప్రమాదభరితంగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేవు. ఖాజీగూడతండాలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఒకే తరగతి గదిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రెండు చోట్ల క్రీడామైదానాలు లేక ఆటలకు దూరంగా ఉంటున్నారు.


