ఆయుష్‌ పోయరూ! | - | Sakshi
Sakshi News home page

ఆయుష్‌ పోయరూ!

Mar 4 2026 9:00 AM | Updated on Mar 4 2026 9:00 AM

పట్టించుకోని ఉన్నతాధికారులు

పురాతన వైద్యానికి కరువైన ప్రాధాన్యత

సిబ్బంది లేక మూతపడిన ఆస్పత్రులు

కళాశాల మంజూరు చేసి వైద్యాన్ని విస్తరించాలని డిమాండ్‌

కొడంగల్‌: కొడంగల్‌ కేంద్రంగా ఆయూష్‌ కళాశాలను మంజూరు చేయాలని ఆయుర్వేద విద్యార్థులు కోరుతున్నారు. నియోజకవర్గానికి చెందిన వందలాది మంది విద్యార్థులు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లి బీఏఎమ్‌ఎస్‌, బీహెచ్‌ఎమ్‌ఎస్‌ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ప్రాంతలో ఆయుష్‌ కళాశాలను ఏర్పాటు చేస్తే ఇక్కడి విద్యార్థులకు మేలు జరిగడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కొడంగల్‌కు ఆయుష్‌ మెడికల్‌ కళాశాలను మంజూరు చేయించాలని గతంలో ఈ ప్రాంత ప్రజలు కడ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు అనేక కళాశాలలను మంజూరు చేశారు. ఇప్పటికే మెడికల్‌ కళాశాల, ఇంట్రిగ్రేటెడ్‌ గురుకులాలు, వృత్తి విద్యా కళాశాల, స్కిల్‌ యూనివర్సిటీ, ఇంజనీరింగ్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, కొత్త మండలాల్లో జూనియర్‌ కళాశాలలను మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయుష్‌ మెడికల్‌ కాలేజీ మంజూరు చేసి ఆసుపత్రుల్లో డాక్టర్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

భవిష్యత్‌ ఆయుర్వేదానిదే..

ఇప్పటికే ఆయుర్వేదం, హోమియోపతి వైద్యానికి ప్రాధాన్యత పెరిగింది. దీర్ఘకాలిక రోగాలకు ఈ వైద్యంలోనే నయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆయుర్వేద, హోమియోపతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు రోగులు కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్‌, యాద్గిర్‌, గుల్బర్గా, రాయిచూర్‌లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని కొడంగల్‌కు ఆయుష్‌ను మంజూరు చేసి పురాతన వైద్యానికి ప్రాధాన్యత కల్పించాలని కొడంగల్‌ వాసులు కోరుతున్నారు.

మూతపడిన ఆస్పత్రులు

నియోజకవర్గంలోని కొడంగల్‌, దౌల్తాబాద్‌, దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రులు పని చేయడం లేదు. డాక్టర్లు, వైద్య సిబ్బంది లేక మూతపడ్డాయి. పేదలకు ఆయుర్వేద వైద్యం అందని ద్రాక్షగా మారింది. కొడంగల్‌, దౌల్తాబాద్‌, దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లో ఆరు ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. అందులో కొడంగల్‌ మండలంలో రుద్రారం, అంగడిరాయిచూర్‌, బొంరాస్‌పేట మండలంలో బొంరాస్‌పేట, దుద్యాల మండలంలో దుద్యాల, దౌల్తాబాద్‌ మండలంలో దౌల్తాబాద్‌, కోస్గి మండలంలోని గుండుమాల్‌లో ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. ఒక్కో దవాఖానాలో ఒక డాక్టర్‌, కంపౌండర్‌, అటెండర్‌, వాచ్‌మెన్‌ ఉండాలి. ప్రభుత్వం వైద్యులను నియమించక పోవడంతో పాటు కింది స్థాయి సిబ్బంది పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఆస్పత్రులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇన్‌చార్జిలు ఉన్న చోట మందులు లేవు. వైద్యులను నియమించి ఆస్పత్రులకు పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయుర్వేద విద్యార్థులు కోరుతున్నారు.

నియోజకవర్గంలోని ఆయుర్వేద ఆస్పత్రులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. ఆయుర్వేద దవాఖానాల పర్యవేక్షణాధికారి కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి అధికారి చూడాల్సి ఉంది. ఆయుర్వేద ఆస్పత్రుల్లో పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ వైద్యం పేదలకు అందే విధంగా కృషి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement