పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు సిద్ధమయింది. ఈ సర్వేకు వలంటీర్లను నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది.
దుద్యాల్: పంట నమోదు ఏఈఓలకు భారమైంది. దీంతో ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్కో వలంటీరును నియమించారు. స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వలంటీరు సంబంధిత పొలం దగ్గరకు వెళ్లి సాగు చేసిన పంటల వివరాలు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
ఫొటోకు రూ.7
పంటల వివరాలు నమోదుకు వలంటీర్లకు వ్యవసాయ శాఖ ఒక్కో ఫొటోకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. ఒక్కో సబ్ సర్వే నంబర్‌కు ఒక్కో ఫోటో తీయాల్సి ఉంటుంది. సబ్ సర్వే నంబర్‌లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో మాత్రమే నమోదు చేయాలి. ఇలా చేయడంతో ఏ రైతు ఏ సర్వే నంబర్‌లో ఏ పంటను సాగు చేస్తున్నారో పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. పంటల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయడంతో సాగు వివరాలు పక్కగా ఉంటాయి. పంట విక్రయాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతు ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్ నంబర్ నమోదు చేసిన వెంటనే పంటల వివరాలు తెలిసిపోతాయి.
12 రెవెన్యూ గ్రామాలు
మండల వ్యాప్తంగా హంసంపల్లి, గౌరారం, దుద్యాల్, హస్నాబాద్, కుదురుమల్ల, నాజుఖాన్‌పల్లి, చిలుముల్ మైల్వార్, మాచన్‌పల్లి, లగచర్ల, హకీంపేట్, ఈర్లపల్లి, పోలేపల్లిలు రెవెన్యూ గ్రామాలు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్‌ను నియమించుకోవాలనే నిబంధన ఉండగా 12 గ్రామాలకు గాను తొమ్మది మందిని నియమించుకున్నారు. ఇందులో హకీంపేట్, పోలేపల్లి, నాజుఖాన్‌పల్లి రెవెన్యూ గ్రామాలకు వలంటీర్లను నియమించకుండా ఏఈఓనే పంట వివరాలు నమోదు చేస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు వలంటీర్లను కలిసి మీ సాగు వివరాలు నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు.
ఒక్కో రెవెన్యూ గ్రామానికి
ఒక్కొక్కరు నియామకం
క్షేత్రస్థాయికి వెళ్లి పంటల నమోదు
హకీంపేట్, పోలేపల్లి, నాజుఖాన్‌పల్లిలో ఏఈఓలతో సర్వే
సదావకాశం
పంటలను సర్వే చేయడా నికి కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. గ్రామాల్లో చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్నాం. ప్రస్తుతం ఈర్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో పంటల వివరాలు నమోదు చేయడానికి వలంటీర్‌గా ఎన్నికయ్యాను. ఉత్సాహంతో పని చేస్తున్నాం.
– మోద్రేచ్చ సంతోష్ కుమార్, వలంటీర్, ఈర్లపల్లి
తప్పులకు ఆస్కారం లేదు
గతంలో పంటలు సాగు చేయకుండా చేసినట్లు నమోదు చేయించారు. ప్రస్తుతం ఆస్కారం లేదు. వలంటీర్ రైతు సాగు చేస్తున్న పొలం లోకేషన్‌కు వెళ్లి సర్వే నంబర్ ఆధారంగా సాగు చేస్తున్న పంటలను నమోదు చేస్తారు. తప్పుడు సమాచారం నమోదుకు అవకాశం లేకుండాపోయింది. పంటలు సాగవుతున్న భూ వివరాలు నమోదు అవుతాయి. – నాగరాజు, మండల వ్యవసాయ అధికారి, దుద్యాల్


