బెల్టు దుకాణాలపై దాడులు: కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

బెల్టు దుకాణాలపై దాడులు: కేసు నమోదు

Mar 4 2026 9:00 AM | Updated on Mar 4 2026 9:00 AM

శంకర్‌పల్లి: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మగ్గురు వ్యక్తులపై మోకిల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు మూసి ఉండడంతో కొంత మంది అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. ఠాణా పరిధిలోని మిర్జాగూడ, జన్వాడ, కొండకల్‌ గ్రామాల్లోని మూడు కిరాణా దుకాణ్లాలో పోలీసులు దాడులు చేశారు. మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి, వారి నుంచి 20 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని చంద్రవంచలో ప్రమాదవశాత్తు జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ మల్లేశ్‌ ఎనిమిది ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. పంట కోత దశకు వచ్చింది. మధ్నాహ్నం పంటకు నిప్పంటుకోవడంతో గమనించిన స్థానికులు రైతుకు సమాచారం ఇచ్చారు. మంటలార్పేందుకు పలువురు విఫలయత్నం చేశారు. తాండూరు ఫైర్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ ఇంజన్‌ వచ్చి మంటాలార్పే వరకు ఆరు ఎకరాల్లో పంటల పూర్తిగా దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని.. సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు.

భూ తగాదాల్లో ఘర్షణ

పలువురికి గాయాలు

ఇరువర్గాలపై కేసులు

పరిగి: మండల పరిధిలోని నస్కల్‌లో మంగళవారం భూ తగాదాలు భగ్గుమన్నాయి. సర్వేనంబర్‌ 216లో కాసుల వెంకటయ్య కుటుంబ సభ్యుల పేరున మూడెకరాల భూమి ఉంది. ఇదే సర్వేనంబర్‌లో దాయాది కాసుల నగేష్‌ రోడ్డు వేసేందుకు జేసీబీతో చదును చేస్తుండగా, వెంకటయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు కొనసాగుతున్నాయని సమాచారం. 202, 203 సర్వే నంబర్లలోని పొలాల విషయంలోనూ ఇరు కుటుంబాలు తగాదా పడుతున్నాయని తెలుస్తోంది.

శ్మశానవాటికలో యువకుడి బలవన్మరణం

మర్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య

పరిగి: శ్మశాన వాటికలో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ, స్థానికులు తెలిపిన ప్రకారం.. దోమ మండలం మైలారం పంచాయతీ పాశంబండ తండాకు చెందిన కాట్రావత్‌ దీపక్‌(23) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం పట్టణంలో ఉండే అక్క నీల వద్దకు వచ్చి పని చూసుకుంటానని చెప్పాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయిన దీపక్‌ ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న శ్మశాన వాటికలో మర్రి చెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ తల్లి పారుబాయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement