
‘భూ భారతి’ విప్లవాత్మక మార్పు
మంచాల: భూ భారతి చట్టం తేవడం విప్లవత్మాక మార్పు అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మంగళవారం ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా భూ సమస్యలతో సతమతవుతున్న రైతులకు భూభారతి చట్టం ఎంత మేలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గతంలో ధరణి ద్వారా కనీసం రికార్డుల్లో తప్పులను కూడా సరి చేసుకోలేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు తిరిగి తలెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా కొంత మంది రైతులు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. అనంతరం మంచాలలో డీసీసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో భూభారతి చట్టం చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ఆర్డీఓ అనంతరెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, మంచాల పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, తహసీల్దార్ ఎం.వీ.ప్రసాద్, ఎంపీడీఓ బాలశంకర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, కొంగర విష్ణు వర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి