● వితంతు 3,781, దివ్యాంగ పింఛన్లు 1,911 ● 19 నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ
సిరిసిల్ల: జిల్లాలో కొత్తగా ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాలను అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆగస్ట్ 1వ తేదీ నుంచి సెప్టెంబరు 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. 9,649 మంది దరఖాస్తు చేసుకోగా.. విచారణ అనంతరం 8,209 మందిని అర్హులుగా గుర్తించి మంజూరు పత్రాలు అందిస్తున్నారు. వితంతు మహిళలు 3,781 మంది, దివ్యాంగులు 1,911, ఒంటరి మహిళలు 510, చేనేత 936, గీత కార్మికులు 1,068 మంది ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే 1,13,264 మందికి పింఛన్లు అందుతుండగా.. కొత్తగా మంజూరైన 8,209 మందితో కలిపితే 1,21,473 మందికి చేయూత పింఛన్లు రానున్నాయి. ఇందుకోసం ప్రతి నెలా ప్రభుత్వం రూ.25.97 కోట్లు వెచ్చిస్తుంది. ఇప్పటికే కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ వేములవాడలో పంపిణీ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జ యంతి సందర్భంగా కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు. అయితే వృద్ధాప్య, బీడీ కార్మి కుల పింఛన్ల కోసం అర్హులు వేచిచూస్తున్నారు.


