సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధానాన్ని మార్చింది. గతంలో కొత్తగా ఇల్లు కట్టుకుంటేనే.. 400– 600 అడుగుల విస్తీరణంలోనే ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నిబంధనలను మార్చుతూ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. గతంలో కట్టుకుని మధ్యలో వదిలేసిన అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా ఇప్పుడు పూర్తి చేసుకోడానికి అవకాశం కల్పించింది. దీని ప్రకారం లెంటల్ లెవల్ వరకు కట్టుకున్న ఇళ్లకు స్లాబ్ వేసుకుని ఇల్లు పూర్తి చేస్తే రూ.2లక్షలు, బేస్‌మెంట్ వరకు కట్టుకుని అసంపూర్తిగా ఉన్న ఇంటికి ఏకంగా రూ.4లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఇల్లు పొజిషన్ బట్టి ఇందిరమ్మ ఇల్లు కింద మంజూరు చేస్తూ.. అసంపూర్తి పనులను మూడు దశల్లో ఎల్–1, ఎల్–2, ఎల్–3 పేరిట బిల్లులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు గతంలో మధ్యలో ఆగిన ఇళ్లకు ఇప్పుడు మోక్షం లభిస్తుందనే ఆశలు చిగురించాయి.
రాష్ట్ర ప్రభుత్వం గుడిసె లేని ఊరు, రేకుల ఇల్లు లేని పట్టణాలు లక్ష్యంగా ఇందిర మ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి అన్ని ఆధారాలతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, పల్లెల్లో ఎండీపీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కలెక్టర్ పరిశీలించిన అనంతరం అర్హులకు బ్యాలెన్స్ పనుల కోసం అనుమతి ఇస్తారు.
నిబంధనలు మారాయి
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు మారాయి. గుడిసెల్లో ఉన్న వారికి తొలి ప్రాధాన్యతనిస్తూ ఇల్లు మంజూరు చేస్తారు. రేకుల షెడ్డు ఉన్న వారికి రెండో ప్రాధాన్యం. గతంలో ఇల్లు కట్టుకుని అసంపూర్తిగా మధ్యలో వదిలేసిన వారికి కూడా మంజూరు ఇస్తారు. పాత ఇల్లు 600 అడుగుల లోపు ఉండాలనే నిబంధనలు ఏమీ లేవు. కొత్త మార్గదర్శకాలకు లోబడి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుంది.
– సాజిద్, హౌజింగ్ ఇన్‌చార్జి పీడీ


