కొనుగోళ్లు లేవు.. దళారులదే దందా! | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు లేవు.. దళారులదే దందా!

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

సిండికేట్‌గా మారి ధాన్యం ధరకు కోత ప్రభుత్వ కేంద్రాలు అలంకార ప్రాయమే.. కల్లాల్లోనే కాంటాలు సొసైటీ డైరెక్టర్లే వ్యాపారుల అవతారం ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు తప్పని నష్టాలు

వేములవాడ రూరల్‌: రైతుల పంట చేతికొచ్చినా గిట్టుబాటు ధర మాత్రం అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకోగా.. క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల బాధ్యతను దళారులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తొలుత అధిక ధర ఆశ చూపి, ధాన్యం కల్లాల్లో పేరుకుపోయిన తర్వాత రేట్లు తగ్గిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొందరు సొసైటీ డైరెక్టర్లే వ్యాపారులుగా మారి ధాన్యం కొనుగోళ్లు సాగిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అటు పత్తి కొనుగోళ్లు కూడా ప్రారంభం కాకపోవడంతో రైతులు రెండు పంటలకూ దళారులనే ఆశ్రయించాల్సి వస్తోంది.

ప్రారంభాలకే పరిమితమైన కేంద్రాలు

జిల్లాలో ఈ వానాకాలం సుమారు 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 34.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ మహిళా సంఘాలు, సొసైటీల ద్వారా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. దీంతో ధాన్యం కల్లాల్లో రోజుల తరబడి నిల్వ ఉండి, పెట్టుబడి అవసరాల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

మొదట ఆశ.. ఆపై ధరకు కోత

ప్రభుత్వ మద్దతు ధర, బోనస్‌ కలిపి సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,920 లభించాల్సి ఉంది. అయితే ప్రైవేటు వ్యాపారులు తొలుత రూ.3 వేల నుంచి రూ.3,100 వరకు ధర చెల్లిస్తామని ఆశ చూపి, ప్రస్తుతం ధాన్యం నిల్వలు పెరగడంతో ధర తగ్గిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక వారు చెప్పిన ధరకే విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది.

డైరెక్టర్లే వ్యాపారులా?

కొన్ని ప్రాంతాల్లో సొసైటీ డైరెక్టర్లే ప్రైవేటు వ్యాపారులుగా మారి కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లారీలను ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారే వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పత్తి కొనుగోళ్లదీ అదే తీరు

మరోవైపు పత్తి కొనుగోళ్లు కూడా ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పత్తిని ఇంటి వద్ద నిల్వ ఉంచుకోలేక, అప్పులు తీర్చేందుకు దళారులకు విక్రయిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement