వణికిస్తున్న వైరల్ ఫీవర్స్ 20 రోజుల్లో 3,143 మంది బాధితులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 1,389 మంది బాధితులు
ముస్తాబాద్(సిరిసిల్ల): విషజ్వరాలు జనాలను వణికిస్తున్నాయి. టైఫాయిడ్, డెంగీ, మలేరియా బాధితులు పెద్దగా నమోదుకాకున్నా వైరల్ ఫీవర్స్ భయపెడుతున్నాయి. నిత్యం కురుస్తున్న వర్షాలకు తోడు మధ్యాహ్నం వేళ ఎండలతో ప్రజల్లో ఇమ్యూనిటి తగ్గిపోతోందని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఫీవర్.. ఫియర్
జిల్లాలో గత ఇరువై రోజుల్లో 3,143 మంది బాధితులు వైరల్ జ్వరాలబారిన పడ్డట్లు రికార్డులు చెబుతున్నాయి. గంభీరావుపేట సీహెచ్‌సీలో 330, ఎల్లారెడ్డిపేట సీహెచ్‌సీలో 307 మందికి పైగా జ్వరాలకు గురయ్యారు. ఇక వేములవాడ ప్రాంతీయ వైద్యశాలలో 647 మందికి, సిరిసిల్ల జిల్లా వైద్యశాలలో 1,389 మంది వైరల్ జ్వరాలతో బాధపడేవారు జాయిన్ అయ్యారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెలలో 43 మంది వైరల్ జ్వరాలతో వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో వైరల్ ఫీవర్ బాధితులు వందల్లో ఉంటారని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి.
బిల్లు జేబుకు చిల్లు
జిల్లాలో జ్వరపీడితులు పెద్ద ఎత్తున ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుండగా.. ఒక్కో బాధితుడికి రూ.2వేల వేరకు ఖర్చు చేస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షలకు తోడు, గోళీలకు వందల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. వైద్యులను సంప్రదించకుండానే పారసిటామల్, డోలో వంటి మందులు కొంటున్నారు. ఒక ఇంట్లో ఒకరికి ముందుగా వస్తున్న వైరల్ ఫీవర్ వారం రోజుల్లో అందరికీ సోకుతుంది. ఇలా ఒక్కో ఇంట్లో రూ.10వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని జ్వరపీడితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు
జ్వరాల బారిన పడ్డ వారు కనీసం మూడు రోజులపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటే చికిత్స పొందుతూ మంచి ఆహారం తీసుకోవాలి. కాచిన నీటిని, వేడి ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తినాలి. ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు ఉంటే వెంట పారబోయాలి.


