రుచి..శుచి.. మరిచి అధ్వానంగా హోటల్ ఫుడ్ తయారీ చూస్తే వాంతులే.. అపరిశుభ్రం.. నిల్వమాంసం.. కుళ్లిన చికెన్ నాసిరకం నూనెలు.. రంగులు, రసాయనాల వినియోగం కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు
సిరిసిల్ల: జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో రుచి, శుభ్రత పాటించడం లేదు. వీధి వ్యాపారుల నుంచి ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్లలోనూ పరిశుభ్రత కొరవడింది. ఆ హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాలు చూస్తే నోరూరుతున్నా.. తింటే వాంతలు అవుడే. వంటగదుల్లో శుభ్రత కరువైంది. మరోవైపు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.. మ రుసటి రోజు వినియోగిస్తున్నారు. మిగిలిన మాంసం, చికెన్ కూరలను సైతం తెల్లవారి వేడి చేసి వడ్డిస్తున్నారు. ఇదంతా జిల్లా కేంద్రంతోపాటు ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ హోటళ్లలోని దుస్థితి.
రంగులు.. రసాయనాలు
జిల్లాలోని పలువురు హోటళ్ల నిర్వాహకులు తమ వ్యాపార అభివృద్ధికి.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వంటల్లో నిషేధిత రంగులను, రసాయనాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ అధికారులు సిరిసిల్ల, వేములవాడల్లో దాడులు చేయగా.. దుర్వాసన వస్తున్న నిల్వ చేసిన మాంసం, కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. నిల్వ ఆహారపదార్థాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు నిషేధిత రంగులు, రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలింది. వాడిపోయిన దోసకాయలు, మెత్తపడిన క్యారెట్, మొలకలొచ్చిన ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
ఇవీ పాటించాలి
సిరిసిల్లలోని ఓ హోటల్‌లో తనిఖీ చేస్తున్న
ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష(ఫైల్)
సిరిసిల్లలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పరిసరాలు ఇలా ఉన్నాయి..
13 కేసులు బుక్ చేశాం
జిల్లాలో ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తనిఖీలు చేసి నిబంధనలు పాటించని 13 మందిపై కేసులు బుక్ చేశాం. మరో 28 హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. ఇంట్లోని ఆహారాన్ని తింటేనే అన్నింటికీ మంచిది. వీలైనంత మేరకు హోటల్ తిండిని తగ్గించుకోవాలి. తప్పదు అనుకుంటే హైజిన్‌గా ఉంటే హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లాలి. ఫుడ్‌సేఫ్టీ విషయంలో రాజీ పడొద్దు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– అనూష, ఫుడ్‌సేఫ్టీ అధికారి
‘ఇటీవల సిరిసిల్లకు చెందిన
ఓ యువకుడి పుట్టిన రోజు నాడు అతని స్నేహితులు ఐదుగురు కలిసి చంద్రంపేట మార్గంలోని ఓ మండీలో బిర్యానీ తిన్నారు. ఇంటికెళ్లిన కొద్దిసేపటికే ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిపాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో యువకులు చావు అంచుల్లోకి వెళ్లివచ్చారు. వెంటనే ఆ యువకుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆ మండి బిర్యానీ సెంటర్‌ను ఫుడ్‌సేఫ్టీ సీజ్ చేశారు. ఇప్పటికీ అది తిరిగి ఓపెన్ కాలేదు.’
‘ఇది గోపాల్‌నగర్‌లో సర్వపిండి తయారీ సెంటర్. ఇక్కడ సర్వపిండి తయారీలో వాడిన నూనెను మళ్లీ..మళ్లీ వాడుతున్నాడు. అయినా కస్టమర్లు ఎగబడి తింటున్నారు. పదే పదే అదే నూనెను కాగబెట్టడం ప్రమాదకరమని తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
హోటల్ వ్యాపారాల స్వరూపం
హోటళ్లు : 920
రెస్టారెంట్లు, దాబాలు : 68
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు : 280
నిత్యం జరిగే వ్యాపారం : రూ.46.66 లక్షలు


